
కోల్ కతాలో ఈవీఎంలు తగలబడటం రాజకీయంగా దుమారం రేపుతోంది. గవర్నమెంట్ బిల్డింగ్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు నాలుగువేల ఈవీఎంలు పూర్తిగా దగ్దమయ్యాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కొద్దిరోజల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈవీఎంలు తగలబడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది బెంగాల్ ప్రభుత్వం.
ఈ ఘటనలో కాలిపోయిన ఈవీఎం మెషీన్లు అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వినియోగించినవిగా గుర్తించారు అధికారులు. ఓటింగ్ తర్వాత భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదేమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల సామాగ్రిని భద్రపరచడంలో నిర్లక్ష్యంపై పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది ఎన్నికల సంఘం.