Reading Time: 2 minutes
IND vs AFG 1st ODI :  టాస్ కూడా పడకుండా అడ్డుకున్న వర్షం.. అసలు మ్యాచ్ రద్దయితే సూపర్ ఓవర్ పెడతారా?

IND vs AFG 1st ODI : ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత.. టీమిండియా మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత, అందరి కళ్లూ ఇప్పుడు వన్డే సిరీస్‌పైనే పడ్డాయి. టీమిండియా తన ఫేవరెట్ బ్లూ జెర్సీని ధరించి.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం తన అధికారిక సన్నాహక ప్రయాణాన్ని ఈ మ్యాచ్ తోనే ప్రారంభించాల్సింది. కానీ భారత్-అఫ్గాన్ ల మధ్య జరగాల్సిన ఈ మొదటి వన్డే మ్యాచ్‌ మజాను వరుణుడు పూర్తిగా పాడు చేసేశాడు. ధర్మశాల వేదికగా శనివారం (జూన్ 13) మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీనికోసం మధ్యాహ్నం 1:00 గంటకే టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ.. నిన్నటి రాత్రి నుంచి అక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా టాస్ వేయడం కూడా సాధ్యపడలేదు. తమ అభిమాన ఆటగాళ్లను మైదానంలో చూడాలని ఎంతో ఆశతో స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. మధ్యలో కాసేపు వర్షం తగ్గినట్లు అనిపించినా.. మళ్లీ పలకరిస్తూనే ఉండటంతో అంపైర్లు కనీసం టాస్ వేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. దీంతో, ఈ మ్యాచ్ అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

కట్-ఆఫ్ టైమ్ రూల్ ఏంటి?

వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే.. దానిని ప్రారంభించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని అంపైర్లు లెక్కిస్తారు. ధర్మశాల వన్డే మ్యాచ్ విషయానికి వస్తే ఈ కట్-ఆఫ్ సమయం సాయంత్రం 6:30 గంటల వరకు ఉంది. అంటే, ఒకవేళ సాయంత్రం 6:30 గంటల కంటే ముందే వర్షం పూర్తిగా తగ్గిపోయి, మైదానం ఆటకు అనుకూలంగా మారితేనే మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ ఆ సమయం దాటిన తర్వాత వర్షం తగ్గినా కూడా మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశం ఉండదు.

కనీసం 20 ఓవర్ల ఆట తప్పనిసరి

అంతర్జాతీయ వన్డే క్రికెట్ నిబంధనల ప్రకారం.. వర్షం వల్ల మ్యాచ్ కి అంతరాయం కలిగినప్పుడు, డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా అయినా ఒక ఫలితాన్ని తేల్చాలంటే రెండు జట్లు కనీసం చెరో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ ఆడాల్సి ఉంటుంది. టి20 క్రికెట్ లో అయితే కనీసం 5 ఓవర్ల ఆట ఉంటే సరిపోతుంది. కానీ వన్డే ఫార్మాట్ లో మాత్రం కచ్చితంగా 20 ఓవర్లు పూర్తి కావాలి. సాయంత్రం 6:30 గంటలలోపు కనీసం 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి సమయం సరిపోతుందని అంపైర్లు భావిస్తేనే ఆటకు అనుమతి ఇస్తారు.

అసలు మ్యాచ్ జరగకపోతే సూపర్ ఓవర్ పెడతారా?

ఫ్యాన్స్ లో చాలామందికి ఒక ఆసక్తికరమైన అనుమానం ఉంది. వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకపోతే ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారా అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అయితే వన్డే క్రికెట్ లో అలాంటి రూల్ లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ద్విపాక్షిక సిరీస్‌లలో మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్ ఓవర్ పెట్టే ప్రసక్తే లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నమెంట్ల (వరల్డ్ కప్ వంటివి) నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వన్డేల్లో మ్యాచ్ టై అయినప్పుడు మాత్రమే సూపర్ ఓవర్ ఇస్తారు. కాబట్టి, ధర్మశాలలో వర్షం తగ్గకుండా ఒక్క బంతి కూడా పడకపోతే ఈ మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేసినట్లు ప్రకటిస్తారు.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.