Reading Time: 2 minutes

అరే ఎవర్రా మీరంతా.. 132 అడుగుల మొబైల్ టవర్.. చిన్న ముక్క కూడా మిగలకుండా.. రాత్రికి రాత్రే మాయం చేసిన గ్యాంగ్

Caption of Image.

అదేదో సినిమాలో.. ఎవర్రా మీరంతా.. ఇలా ఉన్నారేంట్రా అనే డైలాగ్.. ఇప్పుడు అచ్చం దేశం మొత్తం ఇలాగే మాట్లాడుకుంటుంది. అప్పట్లో ఇళ్ల ముందు ఉన్న చెంబులు, బకెట్లు ఎత్తుకెళ్లేవాళ్లు.. ఆ తర్వాత ఇళ్లల్లోకి వచ్చి దోపిడీలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ మారింది. దోపిడీలు, దొంగతనాల్లో జెన్ జీ ఓ అడుగు ముందుకేసింది. ఏకంగా మొబైల్ టవర్లు, బ్రిడ్జీలు ఎత్తుకెళుతున్నారు.. మొబైల్ టవర్లు, బ్రిడ్జీలు ఎత్తుకెళ్లటం ఏంట్రా అని నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజం.. అమ్మతోడు.. మన బీహార్ రాష్ట్రంలోనే జరిగింది. అక్షరాల 132 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద మొబైల్ టవర్ రాత్రికి రాత్రి మాయం అయ్యింది.. పోలీస్ కంప్లయింట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్ టవర్ మాయంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బక్సర్ జిల్లాలో దుమ్రాన్‌లో  ఈ వింత ఘటన జరిగింది.132 అడుగుల టెలికాం టవర్ తో పాటు 15 KVA జనరేటర్ ను కూడా ఎత్తుకెళ్లిన వార్తలు వైరల్ గా మారాయి. ఏండ్లకు తరబడి పనిచేయకుండా ఉన్న  మొబైల్ టవర్‌కు మరమ్మతులు చేయడానికి వచ్చిన GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధికారులు అక్కడ టవర్ లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నివాస ప్రాంతం మధ్యలో ఉన్న భారీ టెలికాం టవర్ ఎవరికీ తెలియకుండా ఎలా ఎత్తుకెళ్లారబ్బా.. అంటూ స్థానికులు నోరెళ్లబెట్టారు. 

ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి దుమ్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో భూ యజమానితో పాటు ఇతర అనుమానిత వ్యక్తులను విచారిస్తామని ఎస్పీ తెలిపారు.  భూ యజమాని హరేనాథ్ యాదవ్ మాట్లాడుతూ, సుమారు 10 సంవత్సరాల క్రితం కంపెనీ ఒక ఒప్పందంపై సంతకం చేసిందని చెప్పారు. 2022లో ఒప్పందం గడువు ముగియడంతో, టవర్‌ను ఏర్పాటు కోసం భూమికి కంపెనీ చెల్లింపులు కూడా నిలిపివేసింది. ఇప్పటి వరకు కంపెనీకి నాలుగు నోటీసులు ఇచ్చాము, కానీ ఎలాంటి స్పందన రాలేదు. టవర్ కనిపించకుండా పోయిందని మాకు ఇప్పుడే తెలిసిందని భూ యజమాని చెప్పాడు.

  • బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి మాయం.. బిహారీలకే సాధ్యం..

గతంలో, రోహ్తాస్ జిల్లాలోని దేహ్రీ-ఆన్-సోన్‌లో సోన్ నదిపై ఉన్న పాడుబడిన ఇనుప రైల్వే వంతెనలో కొంత భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ కాలంలో నిర్మించిన 60 అడుగుల పొడవు, 500 టన్నుల బరువున్న ఇనుప వంతెనను 2022లో ప్రభుత్వ అధికారులుగా చెప్పుకున్న  దొంగలు మాయం చేశారు. 

2023 ఫిబ్రవరిలో సమస్తిపూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు గుర్తు తెలియని దొంగలు 2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌తో పాటు దాని స్క్రాప్‌ను కూడా దోచుకెళ్లారు. ఈ రెండు కేసుల్లోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో చెప్పుకోదగ్గ విషయాలేవీ కాకపోవడం గమనార్హం. 

©️ VIL Media Pvt Ltd.