Reading Time: 2 minutes
Rahul Gandhi Next Election Already Won People Angry But Polls May Not Be Free Fair

కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గెలుస్తాయి. కానీ అసలు సమస్య ఎన్నికల్లో గెలవడం కాదని.. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు దేశంలో ఉన్నాయా? లేదా అన్నదేనని ఆందోళనగా ఉందన్నారు.

ప్రతిపక్ష పార్టీలకు ఐక్యతే ప్రధాన బలమని సూచించారు. “మనమంతా కలిసి నిలబడి ప్రతిఘటిస్తే బీజేపీని ఓడించడం చాలా సులభం. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూస్తే వచ్చే ఎన్నికలు ఇప్పటికే మనవేనని చెప్పొచ్చు. కానీ సమస్య ఏమిటంటే.. గెలిచేందుకు స్వేచ్ఛాయుత ఎన్నికలు ఉండకపోవచ్చు” అని అన్నారు.

బీజేపీ ప్రచారాన్ని ఖండించండి

ప్రతిపక్ష పార్టీలు సమన్వయంతో పనిచేయడం లేదన్న అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. “ఇది బీజేపీ సృష్టిస్తున్న తప్పుడు ప్రచారం. దేశ ఆలోచన, రాజ్యాంగ విలువలను కాపాడే విషయంలో ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి నిలబడతారు” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు, వామపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై స్పందించిన రాహుల్ గాంధీ.. శివుడి ‘నీలకంఠుడు’ రూపాన్ని ప్రస్తావించారు. “మాపై ఎంత విమర్శ చేసినా నవ్వుతూ స్వీకరిస్తాం. విషాన్ని మింగిన నీలకంఠుడిలా వాటిని భరిస్తాం” అని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో రాజీ ప్రశ్నే లేదు

కాంగ్రెస్ సిద్ధాంతపరంగా ఆర్‌ఎస్‌ఎస్ దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. “బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌తో రాజీ పడే పరిస్థితి కాంగ్రెస్‌కు ఎప్పటికీ రాదు. అవసరమైతే మా తలలు నరికేయొచ్చు కానీ మేము ఆర్‌ఎస్‌ఎస్ ముందు తలవంచం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశంలోని కీలక సంస్థలు బీజేపీ ఆధీనంలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. న్యాయ వ్యవస్థ, అధికార యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వరకు ప్రభావితమయ్యాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు దోచుకున్నారనే అనుమానాలు ఉన్నాయని.. అనుమానం వద్దు.. ఎన్నికలు 100 శాతం దోచుకుంటున్నారని ఆరోపించారు.

ప్రతిఘటనే పరిష్కారం

ప్రస్తుతం రాజకీయ పార్టీలకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రతిఘటన మార్గమే సరైనదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. “భారత్ జోడో యాత్ర, నీట్, సీబీఎస్‌ఈ వంటి అంశాలపై పోరాటాలే ప్రజలను చైతన్యపరుస్తాయి. ప్రతి ఉదయం లేచినప్పుడు ‘నేను ఎలా ప్రతిఘటించాలి?’ అని ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.

బీజేపీని ఓడించడం సులభమే

ప్రతిపక్ష పార్టీల్లో నిరాశ కనిపిస్తోందని పేర్కొన్న రాహుల్.. “బీజేపీని ఎలా ఓడిస్తామా అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనమంతా కలిసి నిలిస్తే వారిని ఓడించడం చాలా సులభం. 2024 ఎన్నికల్లో కూడా మేము ఓడిపోలేదు. ఇప్పుడు అందరూ గెలుస్తామనే నమ్మకంతో ముందుకు సాగాలి” అని ఇండియా కూటమి నేతలకు సూచించారు.

‘‘నాకు టీఎంసీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తామే ఘన విజయం సాధిస్తున్నామని వారు గట్టిగా నమ్మారు. నేను వారితో చెబుతూనే ఉన్నాను. మీరు కలల ప్రపంచంలో ఉన్నారు. ఏం జరుగుతుందో నేను చూశాను. గుజరాత్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో, హర్యానా, మహారాష్ట్రలలో నేను చూశాను. అయినా మీలో చాలా మందికి ఇంకా నమ్మకం కుదరలేదు.’’ అని అన్నారు.

‘‘మమతాకి నూటికి నూరు శాతం కచ్చితంగా తెలియదు కానీ.. తన ఎన్నికను దొంగిలించారని ఆమెకు దాదాపు 90 శాతం నమ్మకం ఉంది. ఉద్ధవ్ థాక్రేకు తన ఎన్నికను దొంగిలించారని 40 శాతం నమ్మకం ఉంది. నా సోదరుడు తేజస్వి యాదవ్‌ కూడా 40 శాతం నమ్మకం ఉంది. వినండి.. ఎన్నికలు నూటికి నూరు శాతం దొంగిలించబడుతున్నాయి. దయచేసి మీ మనసుల్లోని సందేహాలను తొలగించుకోండి.’’ అని పిలుపునిచ్చారు.

‘‘గత ఎన్నికల్లో నేను తప్ప ఈ గదిలో ఉన్నవాళ్లలో ఎవరూ కూడా మనం బీజేపీని ఓడించగలమని నమ్మలేదు. ఇప్పుడు ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ మనం వారిని ఓడిస్తామని నమ్మడం ప్రారంభించాలి. మీరు ఆ నమ్మకంతో ప్రారంభించండి. నేను మీకు హామీ ఇస్తున్నాను. రాష్ట్రం తర్వాత రాష్ట్రం.. ఎన్నికల తర్వాత ఎన్నికలు.. వారు మోసం చేసినా చేయకపోయినా.. వారు పడిపోతారు.’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.