Reading Time: < 1 minute
Khawaja Asif Sparks Controversy Amid Pok Protests And Violence

Khawaja Asif: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరుగుతోంది. ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపైకి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారు. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య వందకు పైగా ఉంటుందని భావిస్తు్న్నారు. పీఓకేపై పాక్ ప్రభుత్వం నిర్బంధం, హక్కుల అణిచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాకిస్తార్ రాజ్యాంగాన్ని, ఖురాన్‌లో అత్యంత కఠిన శిక్షల్ని సూచించే శ్లోకాలను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, దీనిపై హక్కుల సంస్థలు, మత పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొంటుున్నారు. ‘‘దేశం పట్ల విధేయతతోనే చర్చలు మొదలవుతాయి’’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆజాద్ కాశ్మీర్‌లో కొంత మంది తప్పుదాడి పట్టిన వ్యక్తులు దేశం పట్ల విధేయత చూపే రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 చదవాలని సూచించాడు.

ఇదే కాకుండా ఖురాన్‌లోని సురా అల్ మాయిదాలోని 33 వచనాన్ని ఉటంకిస్తూ, ‘‘అల్లా, ప్రవక్తపై యుద్ధం చేసి, అవినీతి వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి విధించే శిక్ష ఏమిటంటే వారిని చంపడం లేదా శిలువ వేయడం, వారి చేతులు కాళ్లను నరికివేయడం లేదా ఈ దేశం నుంచి బహిష్కరించడం, ఇది ఈ లోకంలో వారికి అవమానం, పరలోకంలో భయంకరమైన శిక్ష అనుభవిస్తారు’’ అంటూ పీఓకే నిరసనకారుల్ని బెదిరించే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాఖ్యలపై పాక్‌లోని మత పెద్దలు ఖవాజా ఆసిఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ ఉద్యమానికి ఇలాంటి వాఖ్యాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ వ్యతిరేకత, మతపరమైన నేరాల మధ్య ఉన్న తేడాను ఆసిఫ్ వ్యాఖ్యలు మసకబారుస్తున్నాయని, అసమ్మతివాదులను రాజ్యం, మతం రెండింటికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.