Reading Time: 2 minutes

క్యాన్సర్ మందుల ధరల పెంపునకు కేంద్రం ఓకే .. మరింత అందుబాటులోకి రానున్న కీమోథెరపీ మందులు

Caption of Image.
  • క్యాన్సర్ మందుల ధరల పెంపునకు కేంద్రం ఓకే
  •  నాలుగు ఎమర్జెన్సీ మెడిసిన్ల రేట్లు పెంచేందుకు ఎన్‌‌‌‌పీపీఏకు అనుమతి
  •     మరింత అందుబాటులోకి రానున్న కీమోథెరపీ మందులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులు ఎదుర్కొంటున్న మెడిసిన్ల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత అవసరమైన రెండు కీమోథెరపీ మందులతో పాటు మొత్తం నాలుగు రకాల ఔషధాల ధరలను పెంచేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌పీపీఏ)కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా  క్యాన్సర్ నివారణ మందుల తయారీకి వాడే ముడి ప్లాటినం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు దిగుమతి సుంకాలు, కరెన్సీ మార్పిడి విలువల హెచ్చుతగ్గుల వల్ల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. అయితే..ప్రభుత్వం చేపట్టిన ధరల నియంత్రణ చర్యలతో  ఈ మందులను తయారు చేసే కంపెనీలు సొంతంగా ధరలు పెంచుకోలేక, నష్టాలు భరించలేక మెడిసిన్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో మార్కెట్లో క్యాన్సర్  మెడిసిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంపెనీలపై భారం తగ్గి, క్యాన్సర్ మెడిసిన్ల మందుల ఉత్పత్తి మళ్లీ పుంజుకోనుంది.

ధరలు పెరిగే మెడిసిన్లు ఇవే..

కేంద్రం నిర్ణయంతో ప్లాటినం ఆధారిత కీమోథెరపీ ఇంజెక్షన్లయిన ‘సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్’ లతో పాటు రెండు రకాల ధనుర్వాతం (యాంటీ-టెటానస్) ఇంజెక్షన్ల ధరలు పెరగనున్నాయి. ఇవన్నీ అత్యవసరమైన మందుల జాబితాలోకి వస్తాయి. వీటి ముడిసరుకు ఖర్చులను అంచనా వేసి, పాత ధర కంటే 10 శాతం నుంచి 50 శాతంలోపు మాత్రమే ధరల పెంపు ఉండేలా చూడాలని ఎన్‌‌‌‌‌‌‌‌పీపీఏకు ప్రభుత్వం స్పష్టం చేసింది. నోరు, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం (సెర్వికల్) వంటి వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో ప్లాటినం ఆధారిత కీమోథెరపీ మందులను మొదటి ప్రాధాన్యతగా వాడుతుంటారు. ఇవి మార్కెట్లో దొరకకపోవడంపై టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి, దేశవ్యాప్త ఆంకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో కేంద్రం ధరలను పెంచేందుకు అంగీకరించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిగిలిన మరో 78 రకాల మెడిసిన్ ధరల పెంపు అభ్యర్థనలపై నిపుణులతో ఏర్పాటైన కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
 

©️ VIL Media Pvt Ltd.