
చాలా మంది పన్ను (Tax) కట్టే వాళ్ళు వాళ్ళ కష్టార్జితంలో కొంత ప్రభుత్వానికి కట్టకుండా, మొత్తం డబ్బును వాళ్ళ దగ్గరనే ఉంచుకోవాలని అనుకుంటారు. భారతదేశంలో అలాంటి ఒక రాష్ట్రం ఉంది, అదే సిక్కిం (Sikkim). అయితే, ఈ పన్ను మినహాయింపు వెనుక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సిక్కిం రాష్ట్రానికి ఆదాయపు పన్ను ఎందుకు లేదు.. అక్కడికి వేరే రాష్ట్రాల వాళ్లు వలస వెళ్తే పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చా ? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
1975లో జరిగిన ఒక చారిత్రాత్మక ఒప్పందం
ఇదంతా 1975లో సిక్కిం అధికారికంగా భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారినప్పటి నుండి మొదలవుతుంది. భారతదేశంలో కలవకముందు, సిక్కిం అనేది ‘చోగ్యాల్’ రాజవంశం పాలనలో ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అప్పట్లో వారికి సొంత చట్టాలు, సొంత పన్నుల విధానం ఉండేవి. భారతదేశ ఆదాయపు పన్ను చట్టాలు వారికి వర్తించేవి కావు.
సిక్కిం భారతదేశంలో విలీనమైనప్పుడు, వారి పాత చట్టాలను, హక్కులను కాపాడతామని భారత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. దీనికి మద్దతుగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371(F) ని చేర్చారు. ఆ నిబంధన ప్రకారమే ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 10(26AAA)ని తీసుకొచ్చారు.
అసలు చట్టం ఏం చెబుతోంది?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(26AAA) ప్రకారం.. అర్హులైన సిక్కిం పౌరులు ఆ రాష్ట్రంలో సంపాదించే ఆదాయంపై ఎలాంటి ఇన్‌కమ్ టాక్స్ (Income Tax) కట్టాల్సిన అవసరం లేదు. కేవలం జీతాలు, వ్యాపారాల పైనే కాకుండా.. వారికి వచ్చే డివిడెండ్లు, షేర్లు/సెక్యూరిటీలపై వచ్చే వడ్డీలకు కూడా ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఒక్క ప్రత్యేక చట్టం వల్లే సిక్కిం భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా నిలుస్తుంది.
►ALSO READ | నో లైసెన్స్..నో ఆర్‌టీఓ ! ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటే లాభాలే లాభాలు!
ఈ పన్ను మినహాయింపు ఎవరికి
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సిక్కింలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ పన్ను మినహాయింపు వర్తించదు. చట్టం ప్రకారం ఎవరైతే అసలైన సిక్కిమీస్ పౌరులు అవుతారో, వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. అంటే.. ఏప్రిల్ 26, 1975 కంటే ముందే సిక్కిం పౌరుల రిజిస్టర్‌లో పేర్లు నమోదైన వారు, వారి వారసులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఒకవేళ సిక్కింకు వలస వెళ్తే ఏమవుతుంది
చాలా మందికి ఉండే అతిపెద్ద డౌట్ ఇది. సిక్కింలో పన్నులు ఉండవు కాబట్టి.. ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరో, ముంబైకి చెందిన ఒక బ్యాంకరో లేదా హైదరాబాద్‌కు చెందిన ఒక ఉద్యోగో అక్కడికి మారిపోతే పన్నులు కట్టక్కర్లేదని అనుకుంటారు. కానీ అది తప్పు! మీరు సిక్కింలో ఇల్లు కొన్నా, అక్కడే ఉద్యోగం చేస్తూ సంవత్సరాలుగా జీవిస్తున్నా.. మీకు దానంతట అదే పన్ను మినహాయింపు రాదు. ఎందుకంటే మీరు చట్టప్రకారం అసలైన సిక్కిమీస్ పౌరులు కాదు. కాబట్టి మీరు భారతదేశంలోని సాధారణ నిబంధనల ప్రకారమే ఆదాయపు పన్ను కడుతూనే ఉండాలి.
ఈ మినహాయింపు సిక్కిం ప్రజలకు ఎందుకు
ఈ ప్రత్యేక హోదా వల్ల స్థానిక సిక్కిం ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు మిగులుతాయి. దీనివల్ల వారు స్థానికంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి, ఖర్చులు చేయడానికి వీలవుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, భారతదేశంలో సిక్కిం విలీనమైనప్పుడు చేసుకున్న ఒప్పందానికి ఇది ఒక గౌరవ సూచికగా నిలుస్తుంది.
సిక్కిం భారతదేశంలో ఆదాయపు పన్ను లేని ఏకైక రాష్ట్రం అయిన, ఆ ప్రయోజనం కేవలం అక్కడి స్థానిక పౌరులకు మాత్రమే పరిమితం చేసింది. కాబట్టి, వేరే రాష్ట్రాల వాళ్లు అక్కడి ప్రాంతాలకి వెళ్తే ఆదాయపు పన్ను నుండి మాత్రం విముక్తి పొందలేరు!