Reading Time: 2 minutes
Shubman Gill On Stunning Slip Catch I Had Never Taken A Memorable Catch Before

Shubman Gill on Stunning Slip Catch: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ సందర్భంగా గిల్ పట్టిన అద్భుత క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు దీనిని ఇప్పటికే ‘క్యాచ్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణిస్తున్నారు. తాను పట్టిన అద్భుత క్యాచ్‌పై గిల్ స్వయంగా స్పందించాడు.

వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 22వ ఓవర్‌లో అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే బౌలింగ్‌లో అల్లా ఘజన్‌ఫర్ భారీ షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌ వైపు దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ గాల్లోకి డైవ్ చేస్తూ తన ఎడమ చేత్తో అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. గిల్ కుడిచేతి బ్యాటర్ కావడంతో ఎడమచేత్తో పట్టిన ఈ క్యాచ్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను చూసి మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఘజన్‌ఫర్ డకౌట్‌గా వెనుదిరగగా.. ఆ మూమెంట్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.

శుభ్‌మన్ గిల్ పట్టిన క్యాచ్ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. కొందరు దీనిని ఈ ఏడాది అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తుండగా.. మరికొందరు స్లిప్‌లో పట్టిన గొప్ప క్యాచ్‌ల జాబితాలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం తన క్యాచ్ గురించి మాట్లాడిన గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్లిప్ ఫీల్డింగ్‌పై తాను చాలా రోజులుగా ప్రత్యేకంగా సాధన చేస్తున్నానని తెలిపాడు. ‘నేను ఆ క్యాచ్‌ను బాగా అందుకున్నాను. స్లిప్‌లో క్యాచ్‌లు పట్టేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను. మ్యాచ్‌కు ముందు మా ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు భారత జట్టు తరఫున గుర్తుండిపోయే అద్భుత క్యాచ్ నేను పట్టలేదని చెప్పాను. ఈరోజు ఆ క్యాచ్ పట్టడం చాలా సంతోషంగా ఉంది’ అని గిల్ పేర్కొన్నాడు.

ఫీల్డింగ్‌లో మెరిసిన శుభ్‌మన్ గిల్.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 195 పరుగుల లక్ష్య ఛేదనలో అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌కు 7 వికెట్ల తేడాతో విజయం అందించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిన గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అద్భుత క్యాచ్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. ఒకే మ్యాచ్‌లో తన ఆల్‌రౌండ్ ప్రతిభ చూపించి అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.