
కాలం మారినా, తరాలు మారినా తమ పూర్వీకుల సంప్రదాయాలను విడిచిపెట్టకుండా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని యాదవ్‌నగర్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఓ విశిష్ట ఆచారం నేటికీ కొనసాగుతోంది.
తొలకరి వర్షాలు ప్రారంభమై, రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న సమయంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఒక కోడిని పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, భూలక్ష్మి అమ్మవార్ల ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాలు వండి దేవతలకు నైవేద్యంగా సమర్పించి గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు.
పూజల అనంతరం గ్రామస్తులందరూ కలిసి వనభోజనాలకు వెళ్తారు. కోడి కూరతో పాటు సంప్రదాయ వంటకాలు సిద్ధం చేసి సామూహికంగా భోజనం చేస్తారు. ఈ వేడుకలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొని ఆనందంగా గడుపుతారు. కొందరు తాటి కల్లు, ఇతర పానీయాలతో కూడా వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, గ్రామంలోని ప్రతి ఇంటికి తాళం వేసి, ఊరంతా కలిసి బయటకు వెళ్లడం. ఇలా గ్రామం మొత్తం ఒకే కుటుంబంలా వనభోజనాలకు వెళ్లడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయంగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆచారాన్ని పాటిస్తే వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని, గ్రామానికి ఎలాంటి అపశకునాలు రాకుండా ఉంటాయని వారి విశ్వాసం.
తమ పూర్వీకులు అందించిన ఈ సంప్రదాయాన్ని కేవలం తాము మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా అందిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా, యాదవ్‌నగర్ గ్రామ ప్రజలు మాత్రం తమ సంస్కృతి, ఆచారాలను కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..