
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఆదివారం (జూన్ 14, 2026) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. 9వ, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన మొత్తం 180 మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ‘‘ప్రస్తుతం 180 మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ మెరిట్ జాబితాను సిద్ధం చేయడంలో సహకరించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులందరికీ’’ ప్రత్యేక కృతజ్ఞతలు అని విజయ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా టాప్ స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తామన్న ప్రకటనపై సోషల్ మీడియాలో విజయ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
►ALSO READ | OTT Review: డిజిటల్ నిఘాలో జీవితాలు: ల్యాప్‌టాప్, ఫోన్లలో దాగిన షాకింగ్ నిజాలు..
విద్యార్థులను ఉద్దేశించి రష్మిక మందన్న మాట్లాడుతూ.. “మెరిట్ సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మీ వయస్సులో నేను సాధించిన దానికంటే మీరు ఎంతో ఎక్కువగా సాధించారు. జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేయండి. కొన్నిసార్లు మనం గెలుస్తాం, మరికొన్ని సార్లు ఓడిపోతాం. కానీ ప్రతి అనుభవం మనకు కొత్త పాఠాన్ని నేర్పుతుంది” అని ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ద్వారా వేలాది కుటుంబాలకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం మరో కీలక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం విశేషంగా మారింది. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ఈ స్టార్ జంటపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.