Reading Time: < 1 minute
Rajnath Singh Hyderabad Visit Air Force Academy Combined Graduation Parade Drdo Kusha Complex

Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు హైదరాబాద్‌కు రానున్నారు. దేశ రక్షణ రంగంలో కీలక మైలురాళ్లు, మేధావులతో చర్చలు, వాయుసేన అకాడమీలో పరేడ్ వంటి వరుస కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ అత్యంత బిజీగా సాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నాయి. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 26కు చేరుకుని, మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

అనంతరం రక్షణ రంగ పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆయన DRDLకు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రతిష్టాత్మకమైన ‘కుషా కాంప్లెక్స్’ను ప్రారంభించి, అత్యాధునిక ల్యాబొరేటరీలను సందర్శించి శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తారు. సాయంత్రం వేళ గాయత్రి గార్డెన్స్‌లో నిర్వహించే మేధావుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన 12 ఏళ్ల సుపరిపాలన, దేశాభివృద్ధిపై మేధావులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. రాత్రి 6:25 గంటలకు దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుని, అక్కడ శిక్షణ పొందుతున్న క్యాడెట్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేసి, అకాడమీలోని ‘రాష్ట్రకూట్’ భవనంలో రాత్రి బస చేస్తారు.

రేపు ఉదయం రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత గగనతల రక్షణ కవచంలో కొత్తగా చేరబోతున్న యోధుల పరేడ్‌ను సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేస్తారు. ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమం ముగిసిన అనంతరం, ఉదయం 11:10 గంటలకు అకాడమీ నుంచి నేరుగా ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.