
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
హఠాత్తుగా పడిన ఈ వర్షానికి శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తలదాచుకోవడానికి చోటు లేక.. దారిపొడవునా ఉన్న షెడ్ల కిందకు చేరి తడిసి ముద్దయ్యారు.
ఇక ఈ భారీ వర్షం ధాటికి తిరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నదులను తలపిస్తూ ప్రవహించడంతో.. స్థానిక దుకాణాల్లోకి నీరు చేరింది. వ్యాపార సామగ్రి అంతా తడిసిపోవడంతో దుకాణదారులు భారీగా నష్టపోయారు.
►ALSO READ | రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు… బౌలర్లు మారచ్చు.. బ్యాట్స్ మెన్ ఒక్కడే..!: మంత్రి లోకేష్
మరోవైపు అలిపిరి నడక మార్గంలో కొండపై నుండి మెట్ల గుండా వర్షపు నీరు ఉధృతంగా కిందకు కొట్టుకువచ్చింది. దీంతో కాలినడకన వెళ్తున్న భక్తులు ముందుకు అడుగు వేయలేక తీవ్ర అవస్థలు పడ్డారు.
నిరంతరాయంగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అక్కడక్కడా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది, అలాగే బండరాళ్లు, మట్టి పెళ్లలు రోడ్డుపై పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుమలకు ప్రయాణమయ్యే వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకుంటూ సురక్షితంగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.