
ఆదిలాబాద్ టౌన్(జైనథ్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరాల గ్రామం వద్ద ఓ మహిళను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.శ్రావణ్ శుక్రవారం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ ఈ నెల 8న రైలులో ఆదిలాబాద్‌కు వచ్చింది. తిరిగి వెళ్లే మార్గం తెలియక అక్కడే ఉన్న మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పాటన్కు చెందిన అశోక్ భూమన్న బట్టవార్, వణి థాలుకాకు చెందిన సంజీవ్ నాగోరావ్ ను అడిగింది.
దీంతో వారు దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద దింపుతామని చెప్పి బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. నీరాల సమీపానికి చేరుకున్న తర్వాత ఆ మహిళకు అనుమానం రావడంతో వాహనం ఆపాలని కోరగా, నిందితులు ఆమెపై దాడి చేసి అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. బాధితురాలిని గమనించిన స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మి వారి వాహనాల్లో ప్రయాణించవద్దని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.