Reading Time: 2 minutes

థాలీ నుండి డెజర్ట్స్ వరకు అన్ని మామిడితోనే… మ్యాంగో లవర్స్ కి స్వర్గమే..!

Caption of Image.

మామిడి పండ్ల రుచి.. ఒక అద్భుతమైన అనుభూతి!  పిందె నుంచి పండు వరకు నోటికి రకరకాల రుచులు అందిస్తుంది మామిడి. అందుకే సీజన్​లో మాత్రమే దొరికే ఈ మ్యాంగోని పచ్చళ్లు, పొడులు, ఒరుగులు, తాండ్ర.. వంటి పదార్థాలుగా తయారుచేసి మరీ నిల్వచేసుకుంటుంటాం. ఆ సీజన్​ అంతా పండ్ల రుచిని ఆస్వాదిస్తూ పండుగలా సెలబ్రేట్​చేసుకుంటాం. అయితే, హైదరాబాద్​లో మామిడి రుచులను ఒక్కచోట చేర్చి ‘మ్యాంగో ఫీస్ట్’లు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి మధుర జ్ఞాపకం. 

వేసవి కాలం అయిపోయే టైంలో కూడా.. హైదరాబాద్ నగరంలో మామిడి పండ్ల మజా కొనసాగుతూనే ఉంది. సిటీలోని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, వెజ్ డైనింగ్ కేంద్రాలు ప్రత్యేక మ్యాంగో ఫీస్ట్, మ్యాంగో మెనూ, మ్యాంగో థాలీలతో ఫుడ్ లవర్స్‌‌ను ఆకట్టుకుంటున్నాయి. మామిడి పండుతో చేసిన సంప్రదాయ వంటకాలతో అరటి ఆకుపై వడ్డిస్తున్న ఈ ప్రత్యేక విందు సిటీలో హాట్ టాపిక్‌‌గా మారింది. 

స్టార్ హోటళ్ల నుంచి ప్రత్యేక రెస్టారెంట్లు, కెఫేల వరకు ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’కు రెడ్ కార్పెట్ పరుస్తూ నగరవాసులకు అపూర్వ రుచుల విందును అందిస్తున్నాయి. సంప్రదాయ రుచులకు ఆధునిక ఫుడ్ ప్రెజెంటేషన్ జోడించిన ఈ మ్యాంగో ఫీస్టులు సిటీకే ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. 

మ్యాంగో థాలీ

ప్రముఖ హోటల్ అయిన హయత్ హైదరాబాద్.. మ్యాంగో మ్యూస్ అనే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇందులో  అపటైజర్ల నుంచి డెజర్ట్​ల వరకు అన్నీ మ్యాంగో టేస్ట్​తో అందుబాటులో ఉన్నాయి. అలాగే, సిటీలోని కొన్ని వెజిటేరియన్ రెస్టారెంట్లు మామిడి స్పెషల్​ థాలీలను అందిస్తున్నాయి. 

ఆమ్లిషస్ తరహా మ్యాంగో థాలీలో18 నుంచి 20 రకాల వంటకాలు అతిథులను ఆకర్షిస్తున్నాయి. వాటిలో మ్యాంగో కచోరీ, ఆమ్‌‌రస్, మ్యాంగో ఖాండ్వీ, మాల్పువా, మ్యాంగో ఠండాయ్ వంటివి ఉన్నాయి. -రాజధాని థాలీలో జోధ్‌‌పురి మామిడి దాల్ ధోక్లీ, పాలక్ ఆమ్​రస్ చాట్, రబ్రీతో మామిడి స్టఫ్డ్ మాల్పువా, ఆమ్ పన్నాలు.. వాటి రుచితో మైమరిపిస్తున్నాయి.

డెజర్ట్స్‌‌లో హవా

హైదరాబాద్‌‌లోని కెఫేలు, పేస్ట్రీలు, జ్యూస్ సెంటర్లలో మ్యాంగో డెజర్ట్స్‌‌కు డిమాండ్ పెరిగింది. మ్యాంగో ఫ్లేవర్​తో మలై, ఫలూదా, కేకులు, చీజ్‌‌కేక్‌‌లు, ఐస్‌‌క్రీమ్‌‌లు యూత్​ బాగా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ వీటి ఫొటోలు, వ్లాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ కమ్యూనిటీల్లోనూ డెజర్ట్స్‌‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

కాథలీ మ్యాంగో ఫీస్ట్

సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరున్న కాథలీ కేఫ్ వారాంతాల్లో సమ్మర్  సంప్రదాయ విందుగా మ్యాంగో ఫీస్ట్​ను పరిచయం చేసింది. ఫీస్ట్‌‌ టైంలో వారాంతాల్లో మధ్యాహ్నం, రాత్రి పూట ఫుడ్​తోపాటు మ్యాంగో ఐటెమ్స్​ కూడా యాడ్ చేశారు. అరటి ఆకుపై వడ్డించే ఈ విందులో ఆమ్ పన్నా, మామిడి తాండ్ర, మ్యాంగో బొబ్బట్టు, మ్యాంగో బర్ఫీ, కోసంబరి, ఆవకాయ, మాగాయ, మామిడి రోటి పచ్చడి, పులిహోర, పప్పు, కొబ్బరి- మామిడికాయ కూర, సాంబార్, రసం వంటి ఎన్నో రకాల సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వీటితోపాటు కాథలీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన మినీ దోశ, ఆమ్‌‌రస్ పూరీ కూడా ఈ ఫీస్ట్‌‌లో ఉన్నాయి.
 

©️ VIL Media Pvt Ltd.