
సర్ (SIR) ప్రక్రియను అడ్డం పెట్టుకుని అసలైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు పెద్ద స్కెచ్ వేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలోని వేంపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ ఓ ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. సోషల్ మీడియాను జల్లెడ పట్టి.. ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో నిఘా పెడుతున్నారని ఆరోపించారు. అలా గుర్తించిన వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రత్యేక జాబితాలుగా తయారు చేసి, వారి ఓట్లను హోల్డ్‌లో పెడుతూ అక్రమాలకు తెరలేపారని తీవ్ర విమర్శలు చేశారు. టెక్నాలజీని వాడుకుని ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ఓటు హక్కు అనేది కేవలం గెలుపోటములను నిర్ణయించేది కాదు.. అది మన పౌరసత్వానికి రక్షణ కవచం ఒకవేళ ఓటు హక్కు కోల్పోతే, రేపు పౌరసత్వ హక్కులకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క ప్రజలను, కార్యకర్తలను తీవ్రంగా హెచ్చరించారు. అందుకే గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, విస్తృత అవగాహన కల్పించి మన ఓటర్ల జాబితాలను ప్రాణప్రదంగా పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.