
హైదరాబాద్ నట్ట నడిబొడ్డున.. ఎప్పుడూ రోడులూ, వైద్యులు, సిబ్బందితో కిటకిటలాడే పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న బాలికపై దాడికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు. శనివారం (జూన్ 13) జరిగిన ఈ ఘటనతో ఆసుపత్రి వాతావరణం అంతా షాకింగ్ లో మునిగిపోయింది.
ఆస్పత్రి ఆవరణలో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి యత్నించాడు ఓ వ్యక్తి. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్పత్రి ఆవరణలో భవన నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన కూలీ కుటుంబం.. నిమ్స్ లోనే నివాసం ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో భయాందోళనకు గురైన బాలిక ఒక్కసారిగా కేకలు వేసింది. బాలిక అరవడంతో నిందితుడు పారిపోయాడు. బాధిత బాలిక కుటుంబం పంజాగుట్ట పోలీసులకు పిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.