Reading Time: 2 minutes
TeamIndia Captain : ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్.. నెలకు రెంట్ ఎంతో తెలిస్తే షాకే ?

TeamIndia Captain : భారత టీ20 క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీ లెవెల్‌ను నెక్స్ట్ స్టేజ్‌కు తీసుకెళ్లారు. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, ధనవంతులు నివసించే వర్లీ ప్రాంతంలో ఆయన ఒక సూపర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంటి కోసం ఆయన చెల్లించబోయే నెలవారీ అద్దె వింటే సామాన్యుల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం అయ్యర్ నెలకు ప్రారంభ అద్దెగా ఏకంగా రూ.18.50 లక్షలు చెల్లించనున్నారు. ఈ డీల్‌కు సంబంధించిన అధికారిక పత్రాల వివరాలను స్క్వేర్ యార్డ్స్ సంస్థ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఆధారంగా వెల్లడించింది.

వర్లీలోని ప్రముఖ ఆర్టేసియా లగ్జరీ టవర్స్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ ఇల్లు సుమారు 360 చదరపు మీటర్ల (అంటే 3,875 చదరపు అడుగుల) భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కేవలం ఇల్లు మాత్రమే కాదు.. ముంబై లాంటి మెట్రో నగరంలో పార్కింగ్ స్థలం దొరకడమే గగనంగా మారిన తరుణంలో, ఈ ఫ్లాట్‌తో పాటు అయ్యర్ కోసం ఏకంగా నాలుగు కార్ల ప్రత్యేక పార్కింగ్ స్పేస్‌ను కేటాయించారు. శ్రేయస్ అయ్యర్ ఈ ఇంటి కోసం మొత్తం మూడు సంవత్సరాల (36 నెలలు) కాలానికి లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్ కోసం ఆయన రూ.1.84 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.1,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఏకంగా రూ.74 లక్షలు ఇంటి యజమానికి చెల్లించారు.

ఈ లీజు అగ్రిమెంట్ ప్రకారం.. అద్దె ప్రతి సంవత్సరం స్థిరంగా ఉండదు, ఏడాది దాటాక పెరుగుతూ పోతుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.18.50 లక్షల అద్దె ఉండగా.. రెండో సంవత్సరంలో అది దాదాపు 7 శాతం పెరిగి నెలకు రూ.19.79 లక్షలకు చేరుకుంటుంది. ఇక చివరిదైన మూడో సంవత్సరంలో ఈ అద్దె మరింత పెరిగి నెలకు రూ.21.18 లక్షల మార్కును తాకుతుంది. ఈ లెక్కన మూడేళ్ల లీజు కాలం ముగిసేసరికి శ్రేయస్ అయ్యర్ కేవలం అద్దె రూపంలోనే ఆ ఇంటి యజమానికి అక్షరాలా రూ.7.14 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్రికెటర్ల సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి ఈ లీజ్ అగ్రిమెంట్ ఒక పెద్ద ఉదాహరణ.

శ్రేయస్ అయ్యర్ కెరీర్ గత రెండు మూడు ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులను చూసింది. ముఖ్యంగా 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు వచ్చాయి. ముంబై తరఫున డొమెస్టిక్ మ్యాచులు ఆడకుండా స్కిప్ చేశాడనే కారణంతో ఫిబ్రవరి 2024 లో బీసీసీఐ.. జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసింది. ఆ సమయంలో అయ్యర్ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడినట్లు కనిపించింది. దీనికి తోడు 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లతో పాటు 2025 ఆసియా కప్ భారత జట్లలో కూడా అతనికి చోటు దక్కలేదు. అయినా సరే అయ్యర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెళ్లగక్కలేదు.

తనపై పడిన విమర్శలను ఎదుర్కొంటూ, వెన్నునొప్పి గాయం నుంచి కోలుకుంటూ అయ్యర్ కేవలం తన బ్యాటింగ్, ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి పెట్టారు. దాదాపు ఏడాది కాలం పాటు కష్టపడి మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనసులు గెలుచుకున్నారు. సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టు పగ్గాలను అందుకునే రేంజ్‌కు ఎదిగారు. భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయిన కొద్ది రోజుల్లోనే ముంబైలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన లగ్జరీ ఫ్లాట్‌ను సొంతం చేసుకోవడం ఆయన కెరీర్ సక్సెస్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.