
- అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం గుర్నూర్, హర్ష్ దూబే సూపర్ బౌలింగ్..గుర్బాజ్ సెంచరీ వృథా
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 రన్స్‌కు ఆలౌటైంది. ఇండియా 22.5 ఓవర్లలో 195/3 స్కోరు చేసి గెలిచింది. శుభ్‌మన్ గిల్ (84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్–2027 ప్రిపరేషన్స్‌ను టీమిండియా ఘనంగా మొదలుపెట్టింది. ఛేజింగ్‌లో శుభ్‌మన్ గిల్ (66 బాల్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో శనివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై నెగ్గింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. దాంతో టాస్ ఓడిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 రన్స్‌కు ఆలౌటైంది. రెహమానుల్లా గుర్బాజ్ (51 బాల్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో ఆకట్టుకోగా, మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత ఇండియా 22.5 ఓవర్లలో 195/3 స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (39 నాటౌట్), ఇషాన్ కిషన్ (34) ఫర్వాలేదనిపించారు. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం ఇరుజట్ల మధ్య లక్నోలో రెండో వన్డే జరుగుతుంది.
గుర్బాజ్ ఒక్కడే..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఓ ఎండ్‌లో గుర్బాజ్ భారీ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు తీశారు. వన్డేల్లో అరంగేట్రం చేసిన పేసర్ గుర్నూర్ బ్రార్ (3/27) తన తొలి ఓవర్‌లోనే ఇబ్రహీం జద్రాన్ (1)ను ఔట్ చేశాడు. అవతలి వైపు అర్ష్‌దీప్ (2/27) తన వరుస ఓవర్లలో సెడిఖుల్లా అటల్ (0), రహమత్ షా (3)ను పెవిలియన్‌కు పంపడంతో అఫ్గాన్ 26/3తో కష్టాల్లో పడింది. రహమత్ షా ఇచ్చిన క్యాచ్‌ను డెబ్యూ ప్లేయర్ హర్ష్ దూబే వెనక్కి పరుగెడుతూ అందుకున్నాడు.
ఈ దశలో వచ్చిన హష్మతుల్లా షాహిది (27) కాసేపు బ్యాట్ అడ్డేశాడు. 14 రన్స్ వద్ద ఔట్ నుంచి తప్పించుకున్న గుర్బాజ్ 48 బాల్స్‌లో సెంచరీ చేశాడు. కానీ 16వ ఓవర్‌లో నితీశ్ కుమార్ (2/31) అతన్ని ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 116 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. రెండో స్పెల్‌లో మరింత టర్న్ రాబట్టిన స్పిన్నర్ హర్ష్ దూబే (3/47) వరుస విరామాల్లో హష్మతుల్లా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (26), గజన్‌ఫర్ (0) వికెట్లు తీశాడు. మధ్యలో మహ్మద్ నబీ (9) నితీశ్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. చివర్లో రషీద్ ఖాన్ (9), జియావుర్ రెహమాన్ (4)ను బ్రార్ ఔట్ చేశాడు.
రోహిత్ రనౌట్..
ఛేజింగ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (16) ఫెయిలయ్యాడు. ఆరో ఓవర్‌లో అనూహ్యంగా రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 46 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రెండో ఎండ్‌లో గిల్ నిలకడగా ఆడాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ అండగా నిలిచాడు. ఈ ఇద్దరు అఫ్గాన్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని రన్స్ సాధించారు. వీలైనప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో రన్‌రేట్ పెరిగింది. ఈ క్రమంలో గిల్ 37 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 13వ ఓవర్‌లో రషీద్ ఖాన్ (1/37) విడదీశాడు. స్లో ఆఫ్ పిచ్ బాల్‌తో ఇషాన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. భారీ అంచనాలతో దిగిన శ్రేయస్ అయ్యర్ (12) ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేకపోయాడు. 18వ ఓవర్‌లో జియావుర్ (1/39) బౌలింగ్‌లో వెనుదిరిగాడు.142/3 స్కోరు వద్ద వచ్చిన రాహుల్ వేగంగా ఆడాడు. భారీ సిక్సర్లతో అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు 53 రన్స్ జోడించి 13 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్: 24.5 ఓవర్లలో 194 ఆలౌట్ (గుర్బాజ్ 102, గుర్నూర్ బ్రార్ 3/27, హర్ష్ దూబే 3/47).
ఇండియా: 22.5 ఓవర్లలో 195/3 (గిల్ 84*, రాహుల్ 39*, రషీద్ 1/37).