Reading Time: 2 minutes

ఇండియన్ ఆర్మీ నెక్ట్స్ చీఫ్‎గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Caption of Image.

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ నెక్ట్స్ చీఫ్‎గా జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 2026, 30 జూన్ 2026న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. భారత తదుపరి ఆర్మీ చీఫ్‎గా ధీరజ్ సేథ్ నియమాకాన్ని రాష్ట్రపతి ఆమోదించినట్లు శనివారం (జూన్ 13) కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. 2028, ఆగస్టు 31 వరకు ధీరజ్ సేథ్ ఆర్మీ చీఫ్‌గా సేవలు అందించే అవకాశం ఉంది.

ఎవరీ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..? 

ఆర్మర్డ్ కార్ప్స్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ హోదాలో ఉన్నారు. ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుంచి పట్టభద్రులైన తర్వాత 1986లో ఆయన భారత సైన్యంలోకి నియమితులయ్యారు. 

ఇండియన్ ఆర్మీలో ధీరజ్ సేథ్‎కు వివిధ విభాగాల్లో 40 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉంది. విస్తృత శ్రేణి కమాండ్, స్టాఫ్, వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించారు. తన సర్వీస్‎లో ఎడారి ప్రాంతాల నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల వరకు విభిన్న కార్యకలాపాలు నిర్వహించారు. 

లెఫ్టినెంట్ జనరల్ సేథ్ ఒక సాయుధ రెజిమెంట్, ఒక సాయుధ బ్రిగేడ్, తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ప్రతిష్టాత్మకమైన సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా కూడా పనిచేశారు. గ్రౌండ్ లెవల్‎తో పాటు ఉన్నత స్థాయి సైనిక ప్రణాళిక రెండింటిలోనూ ఆయనకు అనుభవం ఉంది. అనేక ప్రధాన జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

►ALSO READ | తమిళనాడులో కొరియా భారీ పెట్టుబడులు: ఏటీఎంల తయారీ, కొత్త షిప్‌యార్డ్ ఏర్పాటు!

ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్‎తో పాటు భారతదేశంలో ఉన్నత సైనిక కోర్సులకు హాజరయ్యారు. వీటిలో పారిస్‌లోని మిలిటరీ కాలేజ్, కాలిఫోర్నియాలోని నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లలోని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 

అంగోలాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో కూడా ధీరజ్ సేథ్ పనిచేశారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం, కమాండ్ విభాగాలలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఆయన అనుభవం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని అత్యంత కీలక ఆర్మీ చీఫ్ పదవికి ధీరజ్ సేథ్‎ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. 

©️ VIL Media Pvt Ltd.