Reading Time: 2 minutes
Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన విద్యార్థులు. సోమవారం నుంచి మళ్లీ పుస్తకాల సంచులు సర్దుకుని క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులు వేయనున్నారు. విద్యార్థుల రాకతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ ఆవరణలన్నీ మళ్లీ కోలాహలంగా మారనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు ఇప్పటికే తరగతి గదులను శుభ్రం చేయించి, కొత్త విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశాయి.

ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు 26,000 కు పైగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, అలాగే వేలాది ప్రైవేట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి ఒకేసారి తెరుచుకోనున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సుమారు 1.10 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది తమ విధులకు హాజరు కానున్నారు. జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను జూన్ 15కి వాయిదా వేసిన అధికారులు.. ఆ మూడు రోజుల పనిదినాల నష్టాన్ని భర్తీ చేసేందుకు జూలై 11 రెండో శనివారం పాఠశాలలు యథావిధిగా నడపాలని నిర్ణయించారు.

2026-27 విద్యా సంవత్సరం క్యాలెండర్ హైలైట్స్

పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నూతన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మొత్తం 227 పనిదినాలు ఉంటాయి. జూలై 31 లోపు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA-1), సెప్టెంబర్ 21 నాటికి FA-2, అక్టోబర్ 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA-1) పరీక్షలు జరుగుతాయి.

అక్టోబర్ 10 నుండి 22 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుండి 27 వరకు క్రిస్మస్ (మిషనరీ స్కూళ్లకు) సెలవులు, 2027 జనవరి 13 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం 2027 ఏప్రిల్ 23తో ముగుస్తుంది. మరుసటి రోజు నుంచే మళ్లీ వేసవి సెలవులు ఇస్తారు.

రేపటి నుంచి కొత్త పథకం

ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మొదటి రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతాన్ని పెంచే లక్ష్యంతో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం, రాగిజావ పంపిణీని కూడా పకడ్బందీగా అమలు చేయనున్నారు. కొత్త క్లాసులు, సరికొత్త పాఠాలతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ విద్యా ప్రయాణం కోసం అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.