
దేశంలో ఆపిల్ ఐఫోన్ల ప్రొడక్షన్‌ను భారీగా పెంచి, చైనాకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్‌కు ఊహించని కష్టాలు వచ్చిపడ్డాయి. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టాటా ఐఫోన్ కాంపోనెంట్స్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు సమీపంలోని వ్యవసాయ భూములు, బావులను కలుషితం చేస్తున్నాయని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నిబంధనల ఉల్లంఘనపై సరైన వివరణ ఇవ్వకపోతే.. ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, యూనిట్‌ను పూర్తిగా మూసివేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టాటా సంస్థకు వార్నింగ్ నోటీసు జారీ చేసింది.
ఈ వివాదం వెనుక కొన్ని నెలలుగా స్థానిక రైతులు పడుతున్న బాధలు ఉన్నాయి. ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల తమ పంట పొలాలు, ఓపెన్ వెల్స్ పాడైపోతున్నాయని రైతులు చేసిన ఫిర్యాదులతో కాలుష్య నియంత్రణ మండలి డిసెంబర్ 2025 నుంచి మే 2026 మధ్య 5 సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మే 25 నాటి రెగ్యులేటరీ నోటీసు ప్రకారం.. టాటా సంస్థ తన ఫ్యాక్టరీ లోపల ఉన్న వర్షపు నీటి నిల్వ చెరువులోకి వేస్ట్ వాటర్ వదిలిందని, అది కాస్తా ఓవర్‌ఫ్లో అయి పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోని భూగర్భ జలాలను కలుషితం చేసిందని అధికారులు తేల్చారు. గత ఏడాది డిసెంబర్ 23న ఇచ్చిన ఆదేశాలపై టాటా సరైన చర్యలు తీసుకోలేదని కూడా నోటీసులో పేర్కొన్నారు.
ఈ ఆరోపణలను టాటా ఎలక్ట్రానిక్స్ తీవ్రంగా ఖండించింది. తాము ఒక గుర్తింపు పొందిన స్వతంత్ర లాబొరేటరీ ద్వారా పర్యావరణ అనాలసిస్ చేయించామని.. ఆ రిపోర్ట్ ప్రకారం తాము అన్ని రకాల ప్రభుత్వ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ పక్కాగా పాటిస్తున్నట్లు తేలిందని స్పష్టం చేసింది. స్థానిక కమ్యూనిటీల సేఫ్టీ, బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులకు తాము కట్టుబడి ఉన్నామని.. కాలుష్య నియంత్రణ అధికారులకు ఇప్పటికే తగిన సమాధానం ఇచ్చామని టాటా పేర్కొంది. అయితే తమ సప్లయర్స్ వ్యర్థాల నిర్వహణపై కఠిన నిబంధనలు అమలు చేసే ఆపిల్ సంస్థ గానీ, తమిళనాడు ప్రభుత్వం గానీ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
►ALSO READ | రఘురామ్ రాజన్ 2013 ఫార్ములా రిపీట్ చేస్తున్న RBI.. రూపాయి నిలదొక్కుకుంటుందా?
దేశంలో పరిశ్రమలు ఇలాంటి పర్యావరణ క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. గతంలో 2024లో మెర్సిడెస్ బెంజ్ కూడా పర్యావరణ చట్టాల లోపాల వల్ల తన ఫ్యాక్టరీలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో పర్యావరణ ప్రమాణాలు పాటించని సుమారు 3,600 పరిశ్రమలను కాలుష్య నియంత్రణ విభాగాలు మూసివేసినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో తెలిపింది. అయితే యాపిల్ సరఫరా గొలుసులో సమస్యలు ఎదురవడం ఇది మొదటిసారి కాదు. గతంలో హోసూర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఫాక్స్‌కాన్ సంస్థలో వివాదాలు రేగినప్పటికీ, ఐఫోన్ తయారీలో భారత్ వేగంగా దూసుకుపోతోంది.
ఈ కాలుష్య వివాదం ఆపిల్ గ్లోబల్ ప్లాన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాలుగేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 శాతంగా ఉన్న భారత ఐఫోన్ల ఉత్పత్తి, 2026 నాటికి ఏకంగా 26 శాతానికి చేరుకుంటుందని రీసెర్చ్ ఫర్మ్ కౌంటర్ పాయింట్ అంచనా వేసింది. చైనా బయట ఆపిల్‌కు ఫాక్స్‌కాన్ తర్వాత టాటానే అతిపెద్ద సప్లయర్‌గా ఉంది. ఇలాంటి కీలక తరుణంలో హోసూర్ ప్లాంట్‌కు మూసివేత నోటీసులు రావడం ఆపిల్, టాటా గ్రూప్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యను టాటా ఎంత త్వరగా పరిష్కరిస్తుందనే దానిపైనే ఐఫోన్ల భవిష్యత్ తయారీ ఆధారపడి ఉంది.