Reading Time: < 1 minute

ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలి..టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

Caption of Image.
  • బాధిత కుటుంబానికి నెలకు రూ.50 వేల పెన్షన్​ ఇవ్వాలి
  • మైనర్లపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతున్నా 
  • ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్​​

హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12 ఏండ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడి బిల్డింగ్ పై నుంచి తీసేయడంతో ఆమె జీవితాంతం నడవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు ఇవ్వడంతోపాటు ప్రతినెలా రూ.50 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్​చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం కవిత పరామర్శించారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రభుత్వ పెద్దలే కేసు వాపస్ తీసుకోవాలంటూ బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు. నిందితుడిని ఉరి తీయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందని, మైనర్లపై ప్రతిరోజూ 5 అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హోమంత్రిగా ఉన్న సీఎం రేవంత్​రెడ్డి స్పందించాలని డిమాండ్​చేశారు. 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి..

నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కవిత సూచించారు. హైదరాబాద్​లోని టీఆర్ఎస్ ఆఫీస్ లో కవితను నేరెళ్ల బాధితులు కలిశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై అప్పటి ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును బాధితులు వివరించారు. నేతల పరామర్శలే తప్ప తమకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కవిత స్పందిస్తూ నేషనల్ ఎస్సీ కమిషన్, తెలంగాణ ఎస్సీ కమిషన్ నేరెళ్ల ఘటనపై విచారణ జరిపి నివేదికలు వెలుగు చూసేలా ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.