
Drishyam 3 OTT: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మూడో భాగం ‘దృశ్యం 3’ కోసం ఓటీటీ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 18 నుంచి ‘దృశ్యం 3’ వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ కానుంది.
కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల ప్రేక్షకులకు కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందుబాటులోకి రానుండటం విశేషం. ‘దృశ్యం 2’ ముగింపు తర్వాత జార్జ్‌కుట్టి తన కుటుంబం ఇక సురక్షితం అని భావిస్తాడు. తన జీవితంలో జరిగిన అనుభవాలనే ఇతివృత్తంగా తీసుకుని ఒక సూపర్ హిట్ సినిమాను కూడా నిర్మిస్తాడు. అంతా సాఫీగా సాగిపోతోందనుకునే సమయంలో గతం మళ్లీ అతడిని వెంటాడటం మొదలుపెడుతుంది.
అతను తీసిన సినిమా వెనుక ఉన్న అసలు రహస్యాలను ఛేదించడానికి ఇద్దరు జర్నలిస్టులు రంగంలోకి దిగుతారు. సరిగ్గా అదే సమయంలో తన కూతురు అంజూకు వచ్చిన ఒక పెళ్లి సంబంధం ఊహించని విధంగా కుటుంబం పాలిట ఒక ఉచ్చులా మారుతుంది. పాత పగలతో శత్రువులు మళ్లీ దాడికి దిగడం, అనుమానాలు, అపరాధ భావనల మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి తన కుటుంబాన్ని జార్జ్ కుట్టి తనదైన తెలివితేటలతో ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరంగా చూపించారు. జీతూ జోసెఫ్ మార్క్ స్క్రీన్‌ప్లే, మోహన్‌లాల్ అద్భుతమైన నటన ప్రేక్షకులను మరోసారి సీటు అంచున కూర్చోబెట్టడం ఖాయమనే చెప్పాలి.