
ఒకప్పుడు అబ్బాయిలు సెల్ఫ్ కేర్ అంటే షేవింగ్, హెయిర్‌కట్, డియోడరెంట్ వరకే పరిమితమయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జెనరేషన్ – జెడ్ యువకులు తమ లుక్, స్కిన్, ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్ వెల్‌బీయింగ్‌పైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తమను తాము బాగా చూసుకోవడం ఇప్పటి వారికి లగ్జరీ కాదు.. లైఫ్ స్టైల్లో భాగంగా మారిపోయింది. కేవలం బయటకు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలనే ఆలోచన పెరిగింది.
ఒకప్పుడు అమ్మాయిలకు మాత్రమే సంబంధించినవిగా భావించిన అనేక విషయాలు ఇప్పుడు అబ్బాయిల రోజువారీ జీవితంలోనూ భాగమయ్యాయి. అయితే ఇప్పుడు కేవలం ఒక సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టి ప్రొడక్ట్స్ సేల్ చేయడం అంత ఈజీ కాదు. ముఖానికి క్రీమ్ రాసుకోవడం, సన్‌స్క్రీన్ వాడటం, స్కిన్‌కు సరిపోయే వాటిని ఎంచుకోవడం వంటి విషయాల్లో అవగాహన పెంచుకుంటున్నారు.
ఏదిపడితే అది కొనడం కాకుండా అందులోని పదార్థాలు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? తమ చర్మానికి సరిపోతాయా? అనే అంశాలు పరిశీలిస్తున్నారు. యాడ్స్ కంటే నిజమైన అనుభవాలు, తమకు కనెక్ట్ అయ్యే కథనాలు, ట్రాన్స్పరెన్సీ ఉన్న బ్రాండ్లపైనే ఎక్కువ నమ్మకం చూపిస్తున్నారు. అందుకే కంపెనీలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకుని సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్లు, షార్ట్ వీడియోల ద్వారా యూత్‌ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
మరోవైపు అబ్బాయిలు జిమ్‌కు వెళ్లడం, రన్నింగ్, సైక్లింగ్ వంటి అలవాట్లు ఇప్పుడు కేవలం ఫ్యాషన్ లేదా శరీరాకృతి కోసం మాత్రమే కాదు. హెల్దీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో చాలామంది వీటిని రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటున్నారు.
ఫిట్‌నెస్‌ను ఒక లక్ష్యంగా కాకుండా జీవితంలో ఒక భాగంగా భావిస్తున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌తోపాటు ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడటం లేదు. ఒత్తిడి, ఆందోళన, బర్న్ అవుట్ వంటి సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం, డిజిటల్ డీటాక్స్ చేయడం, సరిపడా నిద్రకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వంటివి అలవాటు చేసుకుంటున్నారు.