
హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో విషాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది. ఆదివారం (జూన్ 14) జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఓబులేశు.. తన సెక్టార్ పరిధిలో టిఫిన్ చేయడానికి హోటల్కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. హోటల్ వద్దే మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. విధులు పట్ల అంకితభావంతో ఉండే ఓబులేశు మృతి చెందడంతో సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓబులేశు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ గిద్దలూరుగా చెబుతున్నారు.