Reading Time: 2 minutes
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్‌మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు

మరణించిన రెండు నెలల తర్వాత గర్భిణీ మృతదేహాన్ని వెలికి తీసి రీపోర్ట్‌ మార్టం నిర్వహించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన దుర్గాభవానీకి గత ఏడాది కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన వెంకటదుర్గ హనుమాన్ కుమార్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న దుర్గాభవానీ ఏప్రిల్ 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటన జరిగిన రోజు భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతసేపటి తర్వాత గది నుంచి బయటకు వచ్చిన భర్త.. దుర్గాభవానీ స్పందించడం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె మంచంపై అపస్మారక స్థితిలో కనిపించింది. స్థానిక ఆర్ఎంపీ పరీక్షించగా అప్పటికే ఆమె హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు.

గర్భిణీ కావడంతో దహన సంస్కారాలు చేయకుండా గ్రామ శివారులో ఖననం చేశారు కుటుంబ సభ్యులు. అనంతరం భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే కొన్ని రోజుల తర్వాత కుమార్తె ఫోన్‌ను పరిశీలించిన కుటుంబ సభ్యులకు అనుమానాలు మొదలయ్యాయి. ఫోన్‌లోని డేటా తొలగించబడినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. మరో ఫోన్‌లో లభించిన ఆడియో కాల్స్‌లో భర్త పరుష పదజాలంతో మాట్లాడినట్లు ఉండటంతో అనుమానం మరింత బలపడింది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి కుమార్తెను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దుర్గాభవానీ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఈ నెల 2వ తేదీన తండ్రి అయిల సూరన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. తహసీల్దారు శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీనివాస్ నాయక్ సమక్షంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం రీ-పోస్టుమార్టం నిర్వహించింది. అవసరమైన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.

వివాహ సమయంలో భారీగా కట్నం, నగదు, బంగారం ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. కుమార్తె మరణించిన నాలుగు రోజులకే మరో చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోవాలని మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపించడంపై తమకు మరింత అనుమానం వచ్చిందన్నారు. ఆడియో కాల్స్ వింటే తమ కుమార్తెతో ఎంత దారుణంగా ప్రవర్తించారో అర్థమవుతుందని వాపోయారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు..

దుర్గాభవానీ మృతి సహజ మరణమా.. లేక కట్న వేధింపుల నేపథ్యంలో జరిగిన హత్యా అన్నది ఫోరెన్సిక్ నివేదిక, పోలీసు దర్యాప్తుతో తేలనుంది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.