Reading Time: < 1 minute

దేవాదాయ శాఖలో ప్రమోషన్లు!..26 మంది ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

Caption of Image.
  • ఉత్తర్వులు అందజేసిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో గ్రేడ్‌‌-2 నుంచి గ్రేడ్‌‌-1 కార్యనిర్వహణ అధికారులు(ఈవో)గా పదోన్నతి పొందిన 26 మందికి ఆమె ప్రమోషన్‌‌ ఉత్తర్వులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. అర్చకులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలంటే వారు ఆర్థికంగా సంతృప్తిగా ఉండాలని, ఆ దిశగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు.

‘అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు’ ద్వారా అందే రిటైర్మెంట్‌‌ గ్రాట్యుటీ, ఉపనయనం గ్రాంట్, ఇంటి నిర్మాణం, విద్యా పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం పెంచిందని మంత్రి వెల్లడించారు. ఈ పెంచిన మొత్తాలు ఏప్రిల్‌‌ 1 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేశారు. త్వరలోనే ఏసీల నుంచి డీసీలుగా, అలాగే ఇతర విభాగాల్లోనూ పదోన్నతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆలయాల నిర్వహణను బలోపేతం చేసేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌‌ హన్మంతరావును ఆదేశించారు.

నేరుగా ఖాతాల్లోకే నగదు

సంక్షేమ ఫలాలను సులభంగా పొందేందుకు ప్రత్యేకంగా వెబ్‌‌సైట్‌‌, మొబైల్‌‌ యాప్‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. ‘గ్రీన్ ఛానల్’ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను నేరుగా అర్చకుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసేలా డిజిటల్ వ్యవస్థను రూపొందించాలన్నారు. దేవాలయాలను పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడంపై ఉద్యోగులు, అర్చకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.