Reading Time: 2 minutes
Police Complaint Movie Review Varalaxmi Sarathkumar Naveen Chandra

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హారర్ థ్రిల్లర్ జోనర్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సారి ఆ జోనర్‌కు పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడించి, సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఎమ్‌ఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ మీద దర్శకుడు సంజీవ్ కామెంట్స్, క్షమాపణలతో ఈ సినిమా ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్-యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

పోలీస్ కంప్లైంట్ కథ:
ఒక గర్భిణి మహిళ దారుణ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. క్షుద్రపూజల కోణంలో జరిగినట్లు భావించే ఈ మర్డర్ మిస్టరీ కేసు, సరైన ఆధారాలు లేక కొన్నేళ్లపాటు మూలనపడిపోతుంది. అయితే, అద్వైత అనే ఒక చిన్నారి.. “నాకు డాడీ కావాలి” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ పాప ఎవరినైతే ‘డాడీ’ అని పిలుస్తుందో, వారంతా వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ విచిత్రమైన కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ (వరలక్ష్మి శరత్‌కుమార్). దర్యాప్తు తీవ్రమయ్యే కొద్దీ ఆమె భర్త డాక్టర్ రామ్ (నవీన్ చంద్ర) అసలు స్వరూపం బయటపడుతుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ వరుస మరణాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? దీని వెనుక నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా లేక ఏదైనా కుట్ర ఉందా? మూఢనమ్మకాలు, అవినీతి, కర్మ సిద్ధాంతం చుట్టూ తిరిగే ఈ కథ చివరకు ఎలాంటి ముగింపునకు చేరిందనేదే మిగతా సినిమా.

విశ్లేషణ
దర్శకుడు సంజీవ్ మేగోటి ఎంచుకున్న “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ” అనే పాయింట్ చాలా బాగుంది. ఒక వైపు మిస్టరీని నడిపిస్తూనే, మరోవైపు హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను కథలో బ్యాలెన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కేసు చుట్టూ ఉన్న మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. విచారణలో బయటపడే ఒక్కో రహస్యం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది. ముఖ్యంగా సస్పెన్స్ అండ్ హారర్ సీన్స్ సినిమాను బోర్ కొట్టకుండా ముందుకు నడిపించాయి.

నటీనటుల పనితీరు
నవీన్ చంద్ర ఎప్పటిలాగే తన సహజ నటనతో అదరగొట్టాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ తన అనుభవాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె పలికించిన హావభావాలు సినిమాకు పెద్ద అసెట్. కృష్ణసాయి తన పరిధి మేరకు చాలా బాగా నటించాడు. ముఖ్యంగా లెజెండరీ యాక్టర్ సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా వచ్చే ప్రత్యేక సాంగ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అభిమానులను ఖుషీ చేస్తుంది. గ్లామర్ అండ్ యాక్టింగ్‌తో రాగిణి ద్వివేది ఆకట్టుకుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిల కామెడీ ట్రాక్ సినిమాలోని సీరియస్‌నెస్‌ మధ్య మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. వరలక్ష్మితో పాటు పోలీస్ క్యారెక్టర్స్ చేసిన జెమిని సురేష్, విజయభాస్కర్ లు సీరియస్ అండ్ ఫన్నీ టైమింగ్‌తో మెప్పించారు.

ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప అందించిన విజువల్స్ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా హారర్ ఎపిసోడ్స్, నైట్ షాట్స్‌ను చాలా ఎఫెక్టివ్‌గా, థ్రిల్లింగ్‌గా క్యాప్చర్ చేశారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియోల మ్యూజిక్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) హారర్ సీన్లలో భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. కృష్ణ గారి ట్రిబ్యూట్ సాంగ్ కూడా బాగుంది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ గ్రిప్పింగ్‌గా ఉంది. విఎఫ్ఎక్స్ (VFX), సౌండ్ డిజైనింగ్ వర్క్ థ్రిల్లర్ ఎఫెక్ట్‌ను స్క్రీన్ పై బాగా పండించాయి.

బాటమ్ లైన్: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!