
పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 90 రోజుల నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పెట్రోల్, డీజిల్ బంకుల్లో ఇక నుంచి పెద్ద పెద్ద క్యాన్లు, పీపాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టొద్దని.. వేల లీటర్లను పీపాల్లో నింపొద్దని.. అలాంటి వాళ్లకు పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
రిటైల్ పెట్రోల్ బంకుల్లో బైక్స్, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు ఇలాంటి వాహనాల్లోనే పెట్రోల్, డీజిల్ నింపాలని.. పీపాలు తీసుకొస్తే పోయొద్దని స్పష్టం చేసింది. బల్క్ కొనుగోళ్లపై నిషేధం 90 రోజులు అమల్లో ఉంటుందని.. అన్ని రిటైల్ పెట్రోల్ బంకులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
రిటైల్ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ 100 రూపాయలు ఉంటే.. అదే బల్క్ గా కొనుగోలు చేయాలంటే మరో 30 రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని భారంగా చూస్తున్న కాంట్రాక్టర్లు.. రిటైల్ బంకుల్లోనే బల్క్ గా కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల సాధారణ వాహనదారులకు, ప్రజలకు ఆయిల్ కొరత ఏర్పడుతుంది. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు రిటైల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూసేందుకు, బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ ఆర్డర్ 2026 ను జారీ చేసింది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ఈ నిబంధనల ప్రకారం వాహనాల ట్యాంక్ లలో, అనుమతించిన కంటైనర్లలో మాత్రమే పెట్రోల్ డీజిల్ అమ్మాల్సి ఉంటుంది.
అంతే కాకుండా ఒక వినియోగదారుడు రోజుకు ఒక వాహనానికి 200 లీటర్లు మించి డీజిల్ విక్రయించకూడదని స్పష్టం చేసింది కేంద్రం. కొనుగోలు చేసిన డీజిల్ ను తిరిగి విక్రయించడం పూర్తిగా నిషేధించింది కేంద్రం. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని.. పరిస్థితులను బట్టి ప్రభుత్వం మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువు పొడిగిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది కేంద్రం.
ఈ క్రమంలో నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కేంద్రం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యవసర వస్తువుల చట్టం-1955 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కేంద్రం.