
అల్వాల్, వెలుగు: అల్వాల్‌లోని మంగాపురం కాలనీలో గల డీకే ఫార్మాస్యూటికల్స్ సంస్థపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శనివారం ఆకస్మిక దాడి చేసి, భారీ మోసాన్ని బట్టబయలు చేశారు. ఔషధాల తయారీలో వాడే హైడ్రాక్సీప్రొపైల్ బెటాడెక్స్ అనే ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్‌పై అసలు లేబుళ్లను తొలగించి, తప్పుడు వివరాలతో నకిలీ లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.70.56 లక్షల విలువైన 240 కిలోల(12 డ్రమ్ములు) ఫార్మా స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు.
లేబుళ్లపై సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో తయారీ యూనిట్ ఉన్నట్లు పేర్కొనగా, అక్కడ ఎలాంటి కేంద్రం లేదని తేలింది. సంస్థ భాగస్వాములు సతీశ్‌బాబు ధూలపల్లి, నాగస్వామి కాట్రగడ్డ ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్ జి.శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు.