
- రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాడు?
- గద్దర్, చాకలి ఐలమ్మ విగ్రహం ఎందుకు పెట్టలేదు?
- డేటా ఇవ్వడానికి ప్రభుత్వ వెనకడుగు ఎందుకు?: ప్రొఫెసర్ భంగ్య భూక్యా
- కులసర్వేపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, రెడ్లకు మాత్రమే పదవులు దక్కుతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గానికే అండగా ఉంటోందన్నారు. బీసీలకు పదవులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘కుల సర్వే’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ విద్యావేత్తలు, సీనియర్ ప్రొఫెసర్లు, సామాజిక విశ్లేషకులు హాజరయ్యారు. ముఖ్య వక్తలుగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ భంగ్య భూక్యా, ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు, సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి యాదవ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తీరుపై మేధావులు, ప్రొఫెసర్లు విమర్శించారు. కుల గణనలో డేటా పారదర్శకత లేదని, ఒక వర్గానికే ప్రాధాన్యత లభిస్తోందని వారు ఆక్షేపించారు. ఈ సందర్భంగా కంచ ఐలయ్య మాట్లాడుతూ.. రెడ్లు, వెలమలు తెలంగాణకు ఒరిజినల్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? గద్దర్, చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకల విగ్రహాలను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా వెనుక ఏదో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సింహాద్రి రూపొందించిన గ్రామస్థాయి కులాల స్టేటస్ రిపోర్టును ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. బీసీలు తమ గళాన్ని వినిపించడానికి యూట్యూబ్ చానెళ్లను వాడుకోవాలని, కేవలం వీ6 వంటి కొన్ని చానెళ్లు మాత్రమే సబ్బండ వర్గాల వార్తలను ప్రసారం చేస్తున్నాయని ప్రశంసించారు. బీసీలు యూట్యూబ్ చానళ్లు పెట్టుకోలేరా.. మీ భాష మీరు మాట్లాడండని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సర్వేపై ప్రతి కుల సంఘంలోనూ చర్చ జరగాలని, కులాల వారీగా దక్కాల్సిన ఉపాధి, వాటా కోసం గళం ఎత్తాలన్నారు.
డేటా ట్యాంపరింగ్‌కు అవకాశం లేదు: ప్రొ. భంగ్య భూక్యా
తెలంగాణ ప్రభుత్వం కులగణన డేటా అడిగినా ఇవ్వలేదని ప్రొఫెసర్ భంగ్య భూక్యా మండిపడ్డారు. తాము మూడు అంశాలపై సొంతంగా ‘సెల్ఫ్ రిపోర్ట్ డేటా’ తయారు చేశామని, ఇందులో ట్యాంపరింగ్‌కు వీలు లేదన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్లోనే తేడాలున్నాయని స్పష్టం చేశారు. ఇన్‌స్టిట్యూట్లు నాశనం అవుతున్నాయని, విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగలకు భూములు ఉన్నా, విద్యకు మాత్రం ఎందుకు దూరం అవుతున్నారో ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ భారతదేశంలోనే మూడో సంపన్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ టాయిలెట్లు లేని పరిస్థితులు ఉండటం సిగ్గుచేటన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. దేశం మొత్తం అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.