Reading Time: < 1 minute
Hyderabad Tragedy Father And Daughter Die Of Electric Shock While Removing Tree Branches In Alwal

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్‌ షాక్‌కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ ఘటనతో టెలికాం కాలనీ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. అల్వాల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఓ చెట్టు విరిగి సందీప్‌ కుటుంబానికి చెందిన కారుపై పడింది. దీంతో కారుపై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు సందీప్‌ తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు సమీపంలోని విద్యుత్‌ తీగలకు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన సందీప్‌, రితిక అక్కడికక్కడే మృతి చెందారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సందీప్‌ భార్య శ్వేతకు స్వల్ప గాయాలయ్యాయి.

మృతురాలు రితిక ఇంటర్మీడియట్‌ చదువుతుంది. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఒకే ఘటనలో తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.