
భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది.. అదే వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దిగ్గజ బౌలర్లకే చెమటలు పట్టించిన ఈ యువ సంచలనం.. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు క్రికెట్ క్రీడాకారుల గుండెల్లో వణుకు పుట్టించడానికి సూర్యవంశీ కుటుంబం నుండి మరో రన్ మెషిన్ సిద్ధమైంది. వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ వార్తల్లో నిలిచాడు. అన్న బాటలోనే నడుస్తూ లోకల్ లెవెల్ క్రికెట్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ సూర్యవంశీ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా సాగిన ఈ ఇన్నింగ్స్‌లో బౌలర్లు చేతులెత్తేసేలా చేశాడు. ఈ మెరుపు సెంచరీతో క్రికెట్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. అన్న వైభవ్‌లో ఉన్న అగ్రెసివ్నెస్, పరుగుల ఆకలి ఈ చిన్నోడిలో కూడా కరెక్ట్‌గా నూరిపోశారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
21 బౌండరీలతో బౌలర్లకు చుక్కలు..
ఈ మ్యాచ్‌లో ఆశీర్వాద్ సూర్యవంశీ ఆడిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. మొత్తం 87 బంతులను ఎదుర్కొన్న అతడు 118.39 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 103 పరుగులు రాబట్టాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కలిపి మొత్తం 21 బౌండరీలు బాదాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తన ప్రతిభతో ఇండియన్ క్రికెట్‌లో ఒక ముద్ర వేయగా.. ఇప్పుడు తమ్ముడు ఆశీర్వాద్ కూడా అదే రేంజ్‌లో చెలరేగడం సూర్యవంశీ కుటుంబంలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
రెండేళ్లలో మరో క్రికెటర్‌ను ఇస్తా
ఆశీర్వాద్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడటానికి కొద్దిరోజుల ముందే.. వీరి తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన చిన్న కొడుకు గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘‘ఆశీర్వాద్ ప్రస్తుతం ఇంట్లో అందరికంటే చిన్నవాడు, చాలా గారాల కొడుకు. వాడిని ట్రైన్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తోంది. కానీ నాకు నా కష్టం మీద పూర్తి నమ్మకం ఉంది. రాబోయే రెండేళ్లలో వాడిని కూడా ఒక పర్ఫెక్ట్ క్రికెటర్‌గా మార్చి దేశానికి అందిస్తాను’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తండ్రి మాట నిలబెట్టిన చిన్నోడు..
తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆ ప్రకటన చేసిన కొద్దిరోజులకే, ఆశీర్వాద్ బ్యాట్ నుండి ఈ రేంజ్ సెంచరీ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ, తను కూడా భవిష్యత్తులో అన్నలాగే పెద్ద క్రికెటర్ అవుతానని ఈ ఇన్నింగ్స్ ద్వారా ఆశీర్వాద్ నిరూపించుకున్నాడు. సూర్యవంశీ బ్రదర్స్ ఇద్దరూ ఇలా బ్యాట్‌తో సంచలనాలు సృష్టిస్తుండటంతో తండ్రి పడుతున్న శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతోందని క్రీడా పండితులు అభినందిస్తున్నారు.
త్వరలోనే టీమిండియాలో సూర్యవంశీ బ్రదర్స్ హవా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆశీర్వాద్ సూర్యవంశీ కొట్టిన సెంచరీ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. అన్న వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌లను గుర్తుచేసేలా తమ్ముడు కూడా ఆడటంతో భవిష్యత్తులో ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి భారత జట్టు తరఫున ఓపెనింగ్ లేదా మిడిలార్డర్‌లో ప్రత్యర్థి జట్లపై దండయాత్ర చేయడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.