
Home Remedies : సాధారణంగా ఇళ్లలోకి చీమలు వస్తూ పోతూ ఉండటం సర్వసాధారణం. మన శాస్త్రాల ప్రకారం ఇంట్లో చీమలను చూడటం శుభసూచకం అని అంటుంటారు. కానీ, అదే చీమలు గుంపులు గుంపులుగా వస్తే మాత్రం అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వంటగది సింక్ దగ్గర, పంచదార డబ్బాలు, స్వీట్ల పెట్టెలు ఉన్న చోట చీమల దండు ప్రత్యక్షమవ్వడం మనకు రోజువారీ చికాకే.
కొన్నిసార్లు వేడి వంటకాల మూతలు కొద్దిగా తెరిచి ఉన్నా సరే చీమలు వాటిపై దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇంట్లో కెమికల్స్ వాడకుండా, చీమలను సులభంగా నివారించడానికి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ పంకజ్ భదౌరియా ఒక అద్భుతమైన, సురక్షితమైన ఇంటి చిట్కాను సూచించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- ఒక స్ప్రే బాటిల్
- డెట్టాల్ (Dettol)
- ఇంగువ పొడి (Asafoetida)
తయారుచేసే విధానం:
మొదట ఒక ఖాళీ స్ప్రే బాటిల్ తీసుకోండి. అందులో రెండు టీస్పూన్ల డెట్టాల్ లిక్విడ్ వేయండి. ఆ తర్వాత, ఒక టీస్పూన్ మంచి నాణ్యమైన ఇంగువ పొడిని అందులో కలపండి. ఇప్పుడు ఈ బాటిల్‌లో కొద్దిగా నీరు పోసి, మిశ్రమమంతా బాగా కలిసేలా గట్టిగా ఊపండి. అంతే, చీమలను తరిమికొట్టే నాచురల్ స్ప్రే సిద్ధమైనట్లే.
ఎలా ఉపయోగించాలి?
ఈ హోమ్ మేడ్ స్ప్రేను వంటగది పగుళ్లు, కిటికీలు, తలుపుల సందులు, , చీమలు ఎక్కువగా తిరిగే గది మూలల్లో బాగా చల్లాలి. డెట్టాల్ , ఇంగువ కలయికతో వచ్చే ఘాటైన వాసన కారణంగా చీమలు ఆ ప్రాంతంలోకి అస్సలు రావు.
శాస్త్రీయంగా నిరూపితం
రీసెర్చ్‌గేట్ (ResearchGate) లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం.. ఇంగువ అనేది ఒక అద్భుతమైన సహజ కీటక నివారిణిగా (Natural Insect Repellent) పనిచేస్తుంది. ఇంగువకు ఉండే అత్యంత ఘాటైన వాసన, అందులోని సల్ఫర్ ఆధారిత రసాయన సమ్మేళనాలు చీమలను, ఇతర కీటకాలను తక్షణమే దూరం చేస్తాయి.
అయితే, ఇంగువలోని ఈ ఘాటైన సమ్మేళనాలు గాలి, వెలుతురు తగలడం వల్ల కాలక్రమేణా ఆవిరైపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఇంట్లో చీమల బెడద పూర్తిగా వదిలిపోయే వరకు ఈ సహజసిద్ధమైన స్ప్రేను క్రమం తప్పకుండా రోజుకు ఒకసారి చల్లుతూ ఉండటం మంచిది.