Reading Time: 2 minutes
Meenakshi Natarajan Case Complainant Srilatha Reacts Hyderabad Case Row

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కేసు ప్రస్తావించలేదన్న సాకు తిరస్కరించారు. అనంతరం ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్ కావడంతో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి సుప్రీంకోర్టు కూడా విచారణకు నిరాకరించింది. దీంతో మీనాక్షి నటరాజన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

తాజాగా ఇదే వ్యవహారంపై ఫిర్యాదుదారు శ్రీలత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు బలహీనపరచబడిందని ఆమె ఆరోపించారు. “చాలా బాధాకరమైన విషయం జరిగింది. ఆమె గెలుస్తారని అనుకున్నా. 2022లో కుంభం శివకుమార్ రెడ్డి వేధింపులకు పాల్పడ్డారని నేను ఫిర్యాదు చేశాను. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. అయితే దాన్ని కొందరు తప్పుడు కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నారు. తన కేసును రాజకీయ ఒత్తిళ్లతో మూసివేశారని, సాక్ష్యాలు లేవనే కారణంతో దర్యాప్తును బలహీనపరిచారని ఆరోపించారు. “శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు ఎన్నో సందేశాలు పంపాను. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని వాపోయారు.

అనంతరం తాను మీనాక్షి నటరాజన్‌ను కలిసి శివకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖ గురించి అడిగినట్లు తెలిపారు. ‘‘ఆయన ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని ఆమె చెప్పారని. అయితే సస్పెండ్ అయిన వ్యక్తి అధికారిక పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నాడని నేను ప్రశ్నించాను” అని శ్రీలత అన్నారు. తన కేసును దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన శ్రీలత.. “నన్ను పార్టీకి దూరంగా ఉండమని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారు? నేను పార్టీ సభ్యురాలిని కాదంటే అందుకు సంబంధించిన అధికారిక లేఖ చూపించాలి. అదే కారణంతో నేను కోర్టును ఆశ్రయించాను” అని చెప్పుకొచ్చారు.

కోర్టు విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని కూడా ఆమె ఆరోపించారు. “సుమారు 50 మంది.. కొందరు న్యాయవాదులు, కాంగ్రెస్ నేతలు, వంశీ చంద్ రెడ్డి కోర్టు హాల్‌లో ఉన్నారు. ఇది న్యాయ ప్రక్రియపై ప్రభావం చూపే ప్రయత్నంలా అనిపించింది” అని అన్నారు. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని శ్రీలత స్పష్టం చేశారు.