Reading Time: 2 minutes
IND vs PAK : నేడు భారత్ వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ పోరు.. జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!

IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం భారత మహిళల క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. పాక్ జట్టుకు కూడా ఈ టోర్నమెంట్‌లో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఆటగానే కాకుండా రెండు దేశాల అభిమానుల ఎమోషన్స్‌తో ముడిపడి ఉన్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై భారత స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆదివారం జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్ జియోహాట్‌స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్-పాక్ మ్యాచ్ ఒత్తిడి గురించి ఒక సరదా విషయాన్ని పంచుకుంది. “మా బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా నన్ను కలిసినప్పుడు.. అమ్మాయ్, మీరు ఎవరి చేతిలో అయినా ఓడిపోండి కానీ పాకిస్తాన్‌తో మాత్రం ఓడిపోవద్దు అని గట్టిగా చెబుతుంటాడు. ఈ మ్యాచ్ చుట్టూ ఉండే ఒత్తిడి ఎలాంటిదో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రజలు ఈ ఆటను ఎంతగానో ప్రేమిస్తారు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య ఉండే ఈ రైవల్రీని కూడా అంతే ఎంజాయ్ చేస్తారు” అని జెమిమా నవ్వుతూ చెప్పుకొచ్చింది.

పాకిస్తాన్‌తో ఆడిన తన మొదటి మ్యాచ్‌ జ్ఞాపకాలను జెమిమా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. “నేను మొదటిసారి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంతో టెన్షన్‌గా ఉన్నాను. అప్పుడు మా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాకు ధైర్యం చెప్పింది. ఈ మ్యాచ్‌కు ఉండే ఒత్తిడిని మనం కాదనలేమని, ఎందుకంటే భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ క్రికెట్ చరిత్ర అలాంటిదని చెప్పింది. అభిమానులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో మనకు బాగా తెలుసని, కాబట్టి ఆ ప్రెజర్‌ను పాజిటివ్‌గా తీసుకుని మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని హర్మన్ మమ్మల్ని మోటివేట్ చేసింది” అని జెమిమా పేర్కొంది.

ప్రపంచకప్ కోసం భారత జట్టు సన్నద్ధత, ప్రణాళికల గురించి కూడా జెమిమా మాట్లాడింది. “ఒక జట్టుగా మేము ఎప్పుడూ ప్రపంచకప్ ట్రోఫీని గెలవడం గురించే ఆలోచిస్తుంటాము. అది మా రోజువారీ దినచర్యలో ఒక భాగమైపోయింది. మేము ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాము.. ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం ఎక్కువ కాలం నిరంతరం చూస్తూ ఉంటే, తెలియకుండానే మన అడుగులు ఆ దిశగా పడటం ప్రారంభిస్తాయి. గత 2025 వన్డే వరల్డ్ కప్‌లో కూడా మేము ఇదే పద్ధతిని పాటించాము. ఇప్పుడు మా కోచ్ అమోల్ సర్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో మమ్మల్ని ఇదే మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్ళమని చెప్పారు” అని ఆమె వివరించింది.

ఇక వరల్డ్ కప్ సన్నాహకాల గురించి జెమిమా మాట్లాడుతూ జట్టులో ప్రస్తుతం మంచి ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని తెలిపింది. “ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ మాకు అంతగా కలిసిరాలేదన్న మాట నిజమే. కానీ కొన్నిసార్లు విజయాల కంటే ఓటములే మనకు ఎక్కువ విషయాలను నేర్పుతాయి. ఆ సిరీస్‌లో మేము చేసిన తప్పులన్నింటినీ ఒక నోట్‌లా రాసుకుని, నెట్స్‌లో వాటిని సరిదిద్దుకోవడానికి కష్టపడ్డాము. ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. ప్రస్తుతం మా దృష్టి అంతా మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడి పాకిస్తాన్‌పై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించడంపైనే ఉంది” అని జెమిమా రోడ్రిగ్స్ ధీమా వ్యక్తం చేసింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి