Reading Time: < 1 minute

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా గిరిజన సమస్యలు తీరట్లే

Caption of Image.
  • గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం కొరత అట్లనే ఉన్నది: రాంచందర్​రావు
  • ఓయూ సదస్సులో పాల్గొన్న మాజీ గవర్నర్లు దత్తాత్రేయ, విద్యాసాగర్​రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా గిరిజనుల సమస్యలు తీరట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం కొరత ఉన్నదని పేర్కొన్నారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘గిరిజన సమాజ సమస్యలు, అభివృద్ధి’ అంశంపై  నిర్వహించిన సదస్సులో మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్​రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు.

గిరిజనుల భూ హక్కులను రక్షించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని కోరారు. గిరిజన గూడేల్లో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, అనేక చోట్ల అవి సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్పారు. శుద్ధమైన తాగునీటి లభ్యత లేకపోవడం, పోషకాహార లోపం, ఆరోగ్య అవగాహన కొరత వంటి కారణాలతో గిరిజన ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజనులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్​రావు మాట్లాడుతూ.. గిరిజన సమాజ అభివృద్ధికి విద్య అత్యం కీలకమైన సాధనం అన్నారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

 విద్య ద్వారా వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేయవచ్చన్నారు. గిరిజనుల అభివృద్ధితో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ప్రత్యేక గుర్తింపును కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ‘అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి గిరిజన వర్గానికి సమానంగా అందేలా చూడాలి. గిరిజనుల సాధికారత, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి కోసం అన్ని వర్గాలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 

©️ VIL Media Pvt Ltd.