
నాన్ వెజ్ ప్రియులారా.. ఈ వార్త మీకోసమే…! మస్త్ మస్త్ మటన్ బిర్యానీ.. సూపర్ చికిన్ బిర్యానీ అని రెస్టారెంట్‌కి వెళ్లి లొట్టలేసుకుని లాగిస్తున్నారా…! బోటీ భలేగా ఉంది… పాయ అద్దిరిపోయిందంటూ తెగ జుర్రేస్తున్నారా…! ఐతే మీ జీవితానికి కాలం చెల్లినట్టే…! మీరు తింటుంది నాన్ వెజ్ కానే కాదు… ముమ్మాటికి కాలకూట విషం. ఇంతకు మీరు రెస్టారెంట్‌కి వెళ్లి తినే మటన్, తలకాయ, బోటీ, పాయ, చికెన్ లాంటి నాన్-వెజ్ ఐటమ్స్ ఎక్కడ్నుంచి వస్తాయో తెలుసా…! అయితే ఇది మీరు చూస్తే కంగుతింటారు.. చూపించడానికే వీల్లేనంతలా కుళ్లిపోయిందీ మటన్. కాళ్లు, తలకాయలు, బోటీ నుంచి కిలోమీటర్ల పొడవునా కంపు కొడుతోంది. ఇంతకీ ఈ కల్తీ దందా ఎక్కడంటారా…! పవిత్ర పుణ్యక్షేత్రమున్న తిరుపతిలో..
తిరుపతిలో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా ఎలాంటి భయం భక్తి లేకుండా చెలరేగిపోతున్నారు. మాకు డబ్బే ముఖ్యం… ఎవరికేమైతే మాకేంటి అంటూ టన్నుల కొద్దీ కుళ్లిన మాంసాన్ని దర్జాగా రెస్టారెంట్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు. దండిగా జేబులు నింపుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని అమ్ముతున్న మటన్ షాపులపై ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో పెద్ద పీర్ల చావడి ప్రాంతంలోని మటన్ మార్కెట్‌పై హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు.
వీడియో చూడండి..
ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్లు, ఇతర మాంసపు భాగాలను చాలా రోజులుగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని చోట్ల ఫ్రిజర్స్‌లోని మాంసాన్ని తీయడానికి ఇనుప చువ్వలను సైతం వాడారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా 15 షాపుల్లో కుళ్లిన మాంసాన్ని గుర్తించిన అధికారులు… 1000 కేజీలకు పైగా మటన్‌ని సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న మటన్ షాపు ఓనర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..