
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లా హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో అధికారులు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఉత్తర మధ్య రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. ఆదివారం (జూన్ 14) సాయంత్రం ఖజురాహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయని వదంతులు వ్యాపించాయి. దీంతో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో ట్రైన్ హేతంపూర్-ధోల్పూర్ స్టేషన్ల మధ్య రైలు నిలిచిపోయింది. అగ్ని ప్రమాద వదంతులతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగి సమీపంలోని ట్రాక్ దగ్గరకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఫిరోజ్‌పూర్-సియోని పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే రక్షణ దళం (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), స్థానిక అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.