
దట్టమైన నల్లమల అడవిలో ఇక ప్రతి కదలికపై ఓ డిజిటల్ కన్ను నిఘా వేస్తోంది. వేటగాళ్లు, కలప స్మగ్లర్ల బారినుంచి చెట్లను, వన్యప్రాణులను కాపాడేందుకు తెలంగాణ అటవీశాఖ అడ్వాన్స్డ్ టెక్నాలజీని రంగంలోకి దించింది. సోలార్ పవర్‌తో పనిచేసే టవర్లపై అమర్చిన ఏఐ ఆధారిత థర్మల్ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత యాప్‌లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఇప్పుడు స్మార్ట్ ఫారెస్ట్‌గా మారుతోంది.
పచ్చని ఎత్తైన చెట్లు, లోతైన లోయలు, కొండలు, గుట్టలు, కృష్ణానదీ తీరం అయిన నల్లమల అడవిలోని పులులు, వన్యప్రాణులు, టేకు చెట్లను వేటగాళ్లు, కలప స్మగ్లర్ల బారినుంచి కాపాడేందుకు హరిత నిధి ప్రత్యేక ప్రాజెక్టు కింద అటవీశాఖ అధికారులు సర్వైలెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దట్టమైన అడవిలో సోలార్ విద్యుత్‌తో పనిచేసేలా టవర్లు ఏర్పాటు చేసి, దీనిపై థర్మల్ కెమెరాలను అమర్చారు. ఇవి ఏఐ ఆధారిత ఆటోమేటిక్ ఇంటర్ నెట్ సౌకర్యంతో పనిచేస్తాయి.
థర్మల్ కెమెరాలను మన్ననూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ అరణ్యభవన్ లోని టైగర్ ప్రొటెక్షన్ సెల్‌తో అనుసంధానం చేశారు. అడవిలోని కెమెరా ట్రాప్ ఇమేజ్‌లు, వీడియోల సాయంతో అడవుల సంరక్షణ కోసం గూగుల్ సిస్టమ్ సాయంతో టైగర్ మానిటరింగ్ సెల్ చర్యలు తీసుకుంటోంది. అటవీశాఖ కమాండ్ కంట్రోల్ రూం, టైగర్ సెల్ నుంచి నేరుగా అమ్రాబాద్ అభయారణ్యంలోని లైవ్ వీడియోలను 24 గంటలపాటు వీక్షిస్తూ సంరక్షణకు కొత్త చర్యలు చేపట్టింది.
అడవిలో కెమెరా ట్రాప్‌లకు చిక్కిన వేటగాళ్లు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ అల్లంగట్టు అటవీ ప్రాంతంలో మే18న ఆయుధాలతో వన్యప్రాణులను వేటాడేందుకు తిరుగుతున్న నలుగురు వేటగాళ్లు ట్రాప్ కెమెరా కంటికి చిక్కారు. దాంతో కమాండ్ కంట్రోల్ రూంలో 30 సీసీటీవీ కెమెరాల్లోని 300 మోషన్ సెన్సిటివ్ కెమెరా ట్రాప్‌లలో వేటగాళ్ల వీడియోలు రికార్డు అయ్యాయి. ‘‘చీకటిలో కూడా ఐదు మీటర్ల రిజల్యూషన్‌తో జంతువులు, మనుషులను గుర్తించగల థర్మల్ డ్రోన్ పరికరాలతో వేటగాళ్లను ఈజీగా గుర్తించామ’’ని అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ చెప్పారు.
ఇదే విధంగా మన్ననూర్ సమీపంలోని అడవుల్లో వన్యప్రాణులను వేటాడేందుకు ఆయుధాలతో వేటగాళ్లు సంచరిస్తుండగా కెమెరా ట్రాప్ వీడియోలో చూసిన అటవీశాఖ అధికారులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు.‘1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం’ కింద వారిపై కేసు నమోదు చేసి 30 ట్రాప్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
నెమలిని కాపాడిన యాంటీ పోచింగ్ స్క్వాడ్
హైదరాబాద్‌లోని ఆనంద్ నగర్ కాలనీలో జాతీయ పక్షి అయిన నెమలి గాయపడిందని స్థానికుడొకరు టైగర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన టైగర్ సెల్ అధికారులు యాంటీ పోచింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి గాయపడిన నెమలిని కాపాడి, నెహ్రూ జూపార్కులోని వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
చిరుత సంచారంపై అటవీశాఖ అలర్ట్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ ప్రాంతంలోని గుట్టల్లో మే నెల14న రాత్రి 8 గంటలకు చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు టైగర్ సెల్‌కు సమాచారం అందించారు. దీంతో తాము మహబూబ్ నగర్ డిఎఫ్ఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆయన అటవీశాఖ బృందాన్ని సమీప గ్రామాలకు పంపించి అక్కడి ప్రజలను చిరుత బారిన పడకుండా అప్రమత్తం చేశారని టైగర్ సెల్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాత్రివేళ అమ్రాబాద్ అడవిలో పులి సంచరిస్తూ కెమెరాట్రాప్కు చిక్కింది. దీంతో అమ్రాబాద్ అటవీశాఖ అధికారులను అలర్ట్ చేశామని ఆయన చెప్పారు.
తెలంగాణ టైగర్ సెల్
టైగర్ సెల్ పనితీరులో టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. కెమెరాట్రాప్‌లు, జీపీఎస్ ఆధారిత ఎం స్ట్రైప్స్ మొబైల్ యాప్, డ్రోన్ పర్యవేక్షణ, డిజిటల్ డేటా విశ్లేషణ ద్వారా పులుల సంచార మార్గాలను వన్యప్రాణి పరిరక్షణ విభాగం అధికారులు ఈజీగా గుర్తిస్తున్నారు. దీనివల్ల వేట, అడవి ఆక్రమణలు, వన్యప్రాణులపై ముప్పులను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తోందని అటవీశాఖ వన్యప్రాణి విభాగం సీనియర్ అధికారి ఆంజనేయులు చెప్పారు. అలాగే, తెలంగాణలో పులుల సంరక్షణ, అక్రమ వేట నియంత్రణ, పులుల కదలికల పర్యవేక్షణ, మానవ- – వన్యప్రాణుల ఘర్షణల నివారణలో రాష్ట్ర అటవీశాఖకు చెందిన టైగర్ సెల్ కీలక భూమిక పోషిస్తోంది.
రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ అడవుల జీవవైవిధ్య పరిరక్షణకు ఈ విభాగం వెన్నెముకగా నిలుస్తోంది. అరణ్యభవన్ కేంద్రంగా ఏర్పాటైన టైగర్ సెల్‌కి1543 ఫిర్యాదులు వచ్చాయని టైగర్ సెల్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జనవరి నెలలో125 ఫిర్యాదులు, ఫిబ్రవరిలో158, మార్చిలో159, ఏప్రిల్ నెలలో157, మే నెలలో144 ఫిర్యాదులు టైగర్ సెల్‌కు వచ్చాయి.
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో జరిగే అక్రమ వేట, చెట్ల నరికివేతలను గుర్తించడం అటవీశాఖకు పెద్ద సవాలుగా ఉండేది. ఇప్పుడు ఏఐ ఆధారిత థర్మల్ కెమెరాలు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ల సాయంతో అడవిపై 24 గంటల నిఘా సాధ్యమవుతోంది. టెక్నాలజీ, అటవీ సిబ్బంది అప్రమత్తత, ప్రజల సహకారం కలిసి పనిచేస్తే అమ్రాబాద్ మాత్రమే కాదు తెలంగాణ అడవులన్నీ మరింత సురక్షితంగా మారతాయనడంలో సందేహం లేదు. ప్రకృతి సంపదను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇలాంటి సాంకేతిక సంరక్షణే అవసరం.
కలప స్మగ్లర్ల ఆటకట్టు
పెద్ద కందుకూరు శివారు ప్రాంత అడవిలో స్మగ్లర్లు ఈ ఏడాది మే 25న ఓ పెద్ద చెట్టును నరికి కలపను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై గ్రామస్థుడు హైదరాబాద్ అరణ్యభవన్‌లోని టైగర్ సెల్‌కు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఫిర్యాదు చేసి చెట్టు నరికిన అటవీ ప్రాంతాన్ని కూడా చూపించారు. దాంతో అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే సిద్ధిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు చేరవేశారు. వెంటనే ఆ సిబ్బంది వెళ్లి కలపను పట్టుకుని స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు.