
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను.. కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి, చివరకు రీజినల్ రింగ్ రోడ్డుకు కూడా కిషన్ రెడ్డే అడ్డుపడ్డారని సీఎం ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర సీఎంతో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన రేవంత్.. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతో ఒక్కసారైనా మాట్లాడారా అని నిలదీశారు.
ఢిల్లీలో చిట్ చాట్ చేసిన రేవంత్… బీజేపీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా గాడ్సేను మాత్రమే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను కూడా ఆదర్శంగా తీసుకుందని విమర్శించారు. అయితే ఓట్ చోరీ.. లేకపోతే సీట్ చోరీ.. ఈ రెండే బీజేపీకి తెలుసని మండిపడ్డారు. సంఖ్యా బలం లేకపోయినా మధ్యప్రదేశ్‌లో మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు.
ఈ ఘటనతో బీజేపీ అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, ఇటు మహిళా వ్యతిరేకిగా మారిందని.. ఈ వివాదం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరపూరిత దాడికి దిగుతోందని ధ్వజమెత్తారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో అసలు కేసే లేదని ఆయన స్పష్టం చేశారు.
►ALSO READ | హరీష్ రావుకు మంత్రి పొన్నం ఓపెన్ ఛాలెంజ్.. అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ఇక పవన్ కళ్యాణ్ అంశంపై స్పందిస్తూ.. తెలంగాణకు వచ్చేందుకు, వెళ్లేందుకు, ఇక్కడ పోటీ చేసేందుకు పవన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. అయితే, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే మా మంత్రులు పవన్‌పై స్పందించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అలాగే.. హిట్లర్ తనకు ఆదర్శమని తానెప్పుడూ చెప్పలేదన్న రేవంత్ రెడ్డి.. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీతో దిగిన ఫోటోపై స్పందిస్తూ.. మోదీనే నన్ను కౌగిలించుకున్నారు.. నేను ఆయన్ను కౌగిలించుకోలేదు అని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే, ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.