
టెక్నాలజీ ఎంతగా విస్తరిస్తోందో, దానికి తగ్గట్టే సైబర్ మోసాలు కూడా సరికొత్త మార్గాల్లో జరుగుతున్నాయి. మనం సరదాగా దిగే ఒక చిన్న సెల్ఫీ, మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదంగా మారొచ్చని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విజయానికి గుర్తుగా భావించే చేతి రెండు వేళ్లను చూపిస్తూ సెల్ఫీలు దిగుతుంటాం. వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం మామూలే.
అసలు సెల్ఫీ అనగానే గుర్తొచ్చే సింబల్ అదే. సరదాగా దిగే సెల్ఫీలోనూ మన డేటా లీక్ అవుతుందా? అంటే కచ్చితంగా. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఆ హై-రిజల్యూషన్ ఫోటోలను జూమ్ చేసి, వేళ్లపై ఉన్న గీతల ద్వారా మీ బయోమెట్రిక్ వేలిముద్రలను ఈజీగా దొంగిలిస్తున్నారు.
ఈ దొంగిలించిన డేటాతో మీ స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపు యాప్‌లు లేదా ఇంటి స్మార్ట్ డోర్ లాక్‌లను అక్రమంగా తెరవడానికి ప్రయత్నిస్తారు. పాస్‌వర్డ్‌లను మనం ఈజీగా మార్చగలం. కానీ మన వేలిముద్రలను మార్చలేం కాబట్టి, చేతివేళ్లు స్పష్టంగా కనిపించే ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టకుండా జాగ్రత్తపడాలి. భద్రత కోసం సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవసీలో ఉంచుకోవడంతోపాటు, కేవలం వేలిముద్రలపైనే కాకుండా పిన్ లేదా పాస్‌వర్డ్ కూడా అడిగేలా టూ-–స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.