
PoK: పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో ప్రజలు రాజకీయ హక్కులు, అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. అయితే, అక్కడి ప్రజలు బాధల్ని వినకుండా పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపుతోంది. తమ హక్కుల్ని పాక్‌లోని ఇతర ప్రాంతాల వారు ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారు దోచుకుపోతున్నారని పీఓకేలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. పీఓకేను ‘‘పంజాబ్’’గా పాకిస్తాన్ మారుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం, వలసల్ని ప్రోత్సహించడంతో పాటు పీఓకేలోని సహజవనరులను పంజాబ్ ప్రాంతానికి దోచిపెడుతోంది. నిజానికి ఇది పీఓకే ఒక్క ప్రాంత సమస్య కాదు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్సుల హక్కుల్ని కూడా పంజాబ్ ప్రావిన్స్ హరిస్తుందనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. పాకిస్తాన్ అంటే పంజాబ్, పంజాబ్ అంటే పాకిస్తాన్ అనేది నిజం. ఎందుకంటే పాకిస్తాన్ సైనిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో పంజాబీ ఆధిక్యత కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్మీని ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి ప్రాంతాల్లో పంజాబ్ ఆర్మీ అని సంబోధిస్తుంటారు.
పంజాబీల ఆధిపత్యం:
ఇప్పుడు, పాకిస్తాన్ పంజాబీల ఆధిపత్యం గల సైన్యం, అధికార యంత్రాంగం, రాజకీయ వ్యవస్థలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), గిల్గిత్-బాల్టిస్తాన్‌లపై తమ నియంత్రణను కోసం ఒత్తిడి చేస్తున్నాయని హక్కుల కార్యకర్తలు, సంస్థలు చెబుతున్నారు. నిజానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేక భాషా, జాతి సమూహాలకు కేంద్రం. గుజ్జర్, జాట్, రాజ్‌పుత్, సుధాన్, అవాన్, మొఘల్, పష్తూన్ వర్గాలు ఇక్కడి జనాభాలో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా, కాశ్మీరీ, పహారీ, పంజాబీ, హింద్కో, బల్టీ, షీనా వంటి భాషలను కూడా ఇక్కడ మాట్లాడేవారు. పీఓకే దక్షిణ ప్రాంతాలైన మీర్‌పూర్, భింబర్, కోట్లీ ప్రాంతాలు పంజాబ్‌లోని పోథోహార్ ప్రాంతంలో సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారు. పీఓకే అంతా కాశ్మీరీ భాష మాట్లాడే ప్రాంతంగా లేదు. గత కొన్ని దశాబ్ధాలుగా పంజాబ్ ప్రజలు పీఓకేలోకి వలస వెళ్లడం ప్రారంభించారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా పంజాబీల డామినెన్స్ అక్కడ కూడా పెరిగిపోయింది. ఇది తమ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని కాశ్మీరీలు భావిస్తున్నారు.
కరాచీ ఒప్పందంతో నష్టం:
నిజానికి 1949 నాటి కరాచీ ఒప్పందం పీఓకేలోని ప్రజల హక్కుల్ని లాగేసుకుందని చెప్పొచ్చు. ఈ ఒప్పందం ప్రకారం, రక్షణ, విదేశాంగ విధానం, కాశ్మీర్‌కు సంబంధించిన అనేక కీలక విషయాలపై పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పించారు. అప్పటి నుంచి కాశ్మీర్ ప్రజలు తమ అధికారాలను కోల్పోయారు. కీలక విధానాల్ని పాక్ జనరల్ అసెంబ్లీ చేతిలో ఉన్నాయి. పీఓకేకి ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, శాసనసభ ఉన్నప్పటికీ ప్రధాన నిర్ణయాలన్నీ కూడా ఇస్లామాబాద్ పాక్ పార్లమెంట్, రావల్పిండిలోని పాక్ ఆర్మీ తీసుకుంటాయి. దీని వల్ల స్థానిక సంస్థలు చాలా కాలంగా మరింత స్వయంప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఓకేపై పంజాబీ అధికారుల మితిమీరిన ప్రభావం ఉందని అక్కడి సంస్థలు ఆరోపిస్తున్నాయి. స్థానిక నాయకులకు నిజమైన అధికారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భాగమైన గిల్గిత్-బాల్టిస్తాన్ సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు పాక్ పార్లమెంట్‌లో తగిన ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగ హక్కులు లేవు. 1974లో, పాకిస్తాన్ బయటివారి భూ కొనుగోళ్లు మరియు స్థిరనివాసాలపై ఆంక్షలు విధించే నిబంధనలను రద్దు చేసింది. ఇది పంజాబ్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలు వలస రావడానికి మార్గం సుగమం చేసింది. దీని వల్ల ఆ ప్రాంతాల జనాభా స్వరూపమే మారిపోయింది.