
కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి సమీపంలోని పగిడేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. శనివారం నిలిచిపోయిన లెవెల్ బ్రిడ్జి పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దశాబ్దాలుగా వర్షాకాలంలో పగిడేరు వాగు పొంగిపొర్లడం వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.