
లక్నో: ఆర్డర్.. ఆర్డర్.. అందరూ కూర్చొండి.. ఇవాళ నేనే జడ్జిని అంటూ కోర్టులో ఓ మహిళా హల్ చల్ చేసింది. న్యాయమూర్తి సీటులో కూర్చొని సాక్షులను, సాక్ష్యాధారాలను నా ముందు ప్రవేశ పెట్టాలంటూ గందరగోళం సృష్టించింది. జడ్జి కుర్చీ నుంచి లేవాలని సిబ్బంది ఎంత సముదాయించినా తగ్గేదే లే అన్నట్లుగా అలాగే కూర్చొంది. ఈ ఊహించని ఘటనతో దిగ్భ్రాంతికి గురైన కోర్టు సిబ్బంది చేసేదేమిలేక చివరకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహిళా హంగామాతో దాదాపు గంట సేపు కోర్టులో హైడ్రామా నడిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో కోర్టులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..
వారణాసి జిల్లా కోర్టులో శుక్రవారం (జూన్ 12) హైడ్రామా నడిచింది. ఉన్న ఫలంగా ఓ మహిళ కోర్టు గదిలోకి ప్రవేశించి జిల్లా జడ్జి కుర్చీలో కూర్చుంది. ఆర్డర్.. ఆర్డర్.. ఈ రోజు నేను జిల్లా న్యాయమూర్తిని. సాక్షులను, సాక్ష్యాధారాలను నా ముందు ప్రవేశపెట్టండని కోర్టు సిబ్బందిని ఆదేశించింది. ఇక్కడితో ఆగకుండా న్యాయమూర్తి టేబుల్‌పై కొన్ని కేస్ ఫైళ్లను కూడా ఆమె పరిశీలించింది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో కోర్టు సిబ్బంది షాక్‌కు గురయ్యారు.
కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు సదరు మహిళను కుర్చీ నుంచి లేవమని చెప్పగా అందుకే ఆమె ససేమిరా అన్నది. కుర్చీ నుంచి కిందకు దిగడానికి నిరాకరిస్తూ దగ్గరకు వచ్చిన వారిపై గట్టిగా ఆరిచింది. దీంతో దాదాపు గంట పాటు కోర్టులో హైడ్రామా నడిచింది. చివరకు కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఎంక్వైరీలో సదరు మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఆమెను విడుదల చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
►ALSO READ | బాలికలకు రుతుస్రావ సెలవులపై భిన్నాభిప్రాయాలు : కేరళలో ఆసక్తికర చర్చ
అదనపు జిల్లా జడ్జి యజువేంద్ర విక్రమ్ సింగ్ సెలవులో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన కోర్టు ప్రాంగణంలోని భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తింది. భదత్రా తనిఖీలను ధాటి సదరు మహిళ న్యాయమూర్తి కుర్చీ వరకు ఎలా వెళ్లిందనే దానిపై పోలీసులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇంత తీవ్రమైన ఉల్లంఘన ఎలా జరిగింది.. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఆమెను ఎందుకు ఆపలేదో వివరించాలని విధుల్లో ఉన్న అధికారులను కోరారు.