
Mollywood Times Controversy : సినిమా పరిశ్రమలో వివాదాలు కొత్త విషయం కాదు. ఎప్పుడూ ఏదో ఒక సినిమాపై వివాదాలు వస్తూనే ఉంటాయి. నిన్నటికి ‘పెద్ది’ మూవీ, ఇప్పుడు మలయాళ చిత్రసీమలో మరో మూవీకి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. యువ నటుడు నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మాలీవుడ్ టైమ్స్’ చిత్రం థియేటర్లలో మంచి స్పందన అందుకుంటున్న సమయంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో సంబంధం ఉన్న ఒక వివాదం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా సర్టిఫికేషన్ సమయంలో మ్యూట్ చేసిన కొన్ని పదాలను థియేటర్లలో తిరిగి చేర్చారనే ఆరోపణలు చర్చకు దారి తీశాయి. దీంతో సినిమా చుట్టూ తిరుగుతున్న వివాదం ఆసక్తిగా మారింది.
2026 జూన్ 5న విడుదలైన ‘మాలీవుడ్ టైమ్స్’కు అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు. డార్క్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమా కంటెంట్ కంటే, దాని సెన్సార్ పై వస్తున్న వార్తలే ఎక్కువ చర్చకు కారణమవుతున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు సర్టిఫికేషన్ కోసం సమర్పించిన కాపీలో కొన్ని బూతు పదాలను మ్యూట్ చేసి చూపించారని, అయితే థియేటర్లలో విడుదలైన వెర్షన్‌లో ఆ పదాలను మళ్లీ వినిపించేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని CBFC సీరియస్‌గా తీసుకున్నట్లు, అవసరమైతే చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ వివాదం ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. మాలీవుడ్ టైమ్స్ కథ ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఎం. నైట్ శ్యామలన్ వంటి క్రియేటర్ల ప్రభావంతో, మలయాళ చిత్రసీమలో గొప్ప హారర్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కలలు కనే యువకుడి ప్రయాణాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. అతని ఆశయాలు, విజయానికి చేసే ప్రయత్నాలు, సినీ పరిశ్రమలో ఎదురయ్యే ఒత్తిళ్లు అన్నీ కలిపి ఈ కథను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇందులో నస్లెన్‌తో పాటు షరాఫ్ యు ధీన్, వినీత్ శ్రీనివాసన్ కీలక పాత్రల్లో నటించారు. సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్, గోపికా రమేష్, ప్రశాంత్ అలెగ్జాండర్, అల్తాఫ్ సలీం, జగదీష్, బాలచంద్రన్ చుల్లిక్కాడ్ వంటి నటులు కూడా ఇందులో నటించారు. ఈ సినిమాలో ఆర్ష చాందిని బైజు, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే నస్లెన్ కెరీర్ కూడా ఆసక్తికర దశలో ఉంది. ప్రస్తుతం ఆయన సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సూర్య 47’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో నజ్రియా నజీమ్ ఫహద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘బ్యాచిలర్ పార్టీ డీయూ’ సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసిన నస్లెన్, ఆసిఫ్ అలీ నటిస్తున్న ‘టికీ టాకా’లో కూడా భాగమయ్యారు. అలాగే మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఖలీద్ రెహమాన్ తెరకెక్కిస్తున్న ‘మట్టంచెర్రీ మాఫియా’లో కూడా ఆయన నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే సినీ వర్గాల దృష్టి మొత్తం ‘మాలీవుడ్ టైమ్స్’ వివాదంపైనే ఉంది. సినిమా కంటెంట్ కంటే సెన్సార్ అంశం ఎక్కువ చర్చకు దారి తీస్తుండగా, CBFC ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అయితే మంచి స్పందన వస్తోంది.