
హైదరాబాద్ శివార్లలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. డంపింగ్ యార్డ్ చెత్త రవాణా కాంట్రాక్టులు, సివిల్ వర్క్స్‌కు సంబంధించిన సుమారు రూ. 23.40 కోట్ల ప్రభుత్వ చెల్లింపుల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ సామాజిక కార్యకర్త ఆకుల సతీష్.. మున్సిపల్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ భారీ కుంభకోణంలో మున్సిపల్ అధికారుల పాత్ర ఉందంటూ ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధీరజ్ కుమార్ (ప్రస్తుతం శేరిలింగంపల్లి డిప్యూటీ ఇంజనీర్), మాజీ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సబీర్ అలీతో పాటు పలువురు సంబంధిత అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసలు కాంట్రాక్టర్ కె. చంద్రశేఖర్‌కు చెల్లించాల్సిన నిధులను, పక్కా ప్లాన్‌తో ఒక నకిలీ సంస్థ ను సృష్టించి దాని ద్వారా మళ్లించారనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి.
►ALSO READ | బంజారాహిల్స్ నిలోఫర్ కు షాక్.. ఫైర్ NOC సస్పెండ్ చేసిన డీజీ
ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేపట్టాలన్న ఆకుల సతీష్.. గత 2020 నుంచి 2025 వరకు జరిగిన డంపింగ్ యార్డ్ చెల్లింపులు, సివిల్ వర్క్స్ బిల్లులు, కాంట్రాక్టుల మంజూరు ప్రక్రియలకు సంబంధించిన అన్ని ఫైళ్లను పూర్తిస్థాయిలో రీ-వెరిఫికేషన్ చేయాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలితే.. బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అక్రమంగా కాజేసిన ప్రభుత్వ నిధులను వెంటనే రికవరీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అయితే, ప్రస్తుతం వెల్లువెత్తిన ఈ సంచలన ఆరోపణలపై నిజాంపేట్ మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఉన్నతాధికారుల విచారణ అనంతరం ఈ రూ. 23 కోట్ల చెత్త రవాణా కాంట్రాక్టుల వెనుక ఉన్న అసలు వాస్తవాలు, నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.