
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తీవ్ర కలకలం రేగింది. జీహెచ్‌ఎంసీ (GHMC) ఉద్యోగులు.. ఏకంగా విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైనే దాడికి తెగబడ్డారు.
బంజారాహిల్స్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న . శ్రీశైలంపై ఈ దాడి జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారుల వాహనాన్ని కానిస్టేబుల్ అడ్డుకోవడమే ఈ వివాదానికి కారణమైంది. జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్‌కు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ అమిత్, ఏఈ ఆనంద్‌తో పాటు మరో ఉద్యోగి.. కానిస్టేబుల్ శ్రీశైలంతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
సహనం కోల్పోయిన సదరు ఉద్యోగులు.. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై నోరుపారేసుకుంటూ దుర్భాషలాడటమే కాకుండా, కానిస్టేబుల్ శ్రీశైలంపై భౌతికంగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడి, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలపై.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 121(1), 132, 352, 351(2) కింద జీహెచ్‌ఎంసీ ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.