Reading Time: < 1 minute

ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ కొలువులోకి!..అంగన్‌‌‌‌ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన అంగన్‌‌‌‌ వాడీ కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మళ్లీ తమ పాత ఉద్యోగాల్లో చేరేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ కీలక మెమో జారీ చేశారు. 2013, 2015 సంవత్సరాల్లో జారీ చేసిన ఉత్తర్వులనే ప్రస్తుత నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగన్‌‌‌‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ పదవులకు రాజీనామా చేయాలి. కాగా ఎన్నికల ఫలితాల్లో ఓడిపోయిన వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.  తమ పాత పోస్టులో తిరిగి చేర్చుకోవాలని కోరుతూ బాధితులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌‌‌ కు ప్రభుత్వం సూచించింది.

ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంటేనే..

మళ్లీ విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం కీలక షరతును విధించింది. అంగన్‌‌‌‌ వాడీ కార్యకర్త, హెల్పర్ రాజీనామా చేసిన తర్వాత, ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించకుండా ఉండాలి. సదరు పోస్టు ఇంకా ఖాళీగా ఉంటేనే పాత వ్యక్తిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. 

©️ VIL Media Pvt Ltd.