
హుజురాబాద్ అంటేనే బిఅర్ఎస్ అడ్డా అని.. ఒక్క ఉప ఎన్నికలు తప్ప ప్రతి ఎన్నికల్లో బీఅర్ఎస్ విజయం సాధించిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
హుజురాబాద్ అంటే కేసిఆర్ కు ప్రేమ కాబట్టి రైతు బంధు, దళిత బంధు ఇక్కడి నుండే ప్రారంభించారని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని MPR గార్డెన్ లో బిఅర్ఎస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజక వర్గ పార్టీ సభ్యత్వ నమోదు , SIR పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. బీఅర్ఎస్ కమిటీలు వేయడమే కాకుండా శిక్షణ శిబిరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు.
ఎన్నికల్లో ఇవ్వని హామీలు కాకుండా మరో 500ల పథకాలు ప్రవేశ పెట్టింది కేసీఆరేనని చెప్పారు. గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీ జరిగితే.. రేవంత్ రెడ్డి పెట్టిన అబద్ధపు ఆశలే గెలిచాయని హరీష్ రావు విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం 20 వేల కోట్ల రైతు బంధు పైసలను ఎగరగొట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎరువులు, వడ్ల కొనుగోళ్లు లేక, రైతు బీమా అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
►ALSO READ | హైదరాబాద్ సక్కగా చేయండి.. ప్యూచర్ సిటీని ఎవరూ నమ్మటం లేదు : కేటీఆర్
రైతులకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ.. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, కొత్త హెలికాప్టర్లు కొనడానికి మాత్రం కోట్లాది రూపాయల డబ్బులు ఉంటాయా?” అని హరీష్ రావు ప్రశ్నించారు. నెల రోజుల్లో రైతు డిస్కం రాబోతోందని, దీంతో రోజుకు కేవలం 6 గంటల విద్యుత్ మాత్రమే వచ్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సాగిస్తున్న హిట్లర్ పాలనను అంతం చేయడానికి తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారని, ముఖ్యమంత్రి మాట్లాడే ధ్వని కాలుష్యాన్ని నివారించే పనిలో జనం ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇక హుజూరాబాద్ డంపింగ్ యార్డు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని భరోసా ఇచ్చారు. ఐదేళ్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను మరమ్మత్తు చేయలేదని, మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే మేడిగడ్డను బాగు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రతిపక్ష హోదాలో కాదు.. పాలక పక్ష హోదాలోకి వస్తుందని, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.